ఏలూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి
అగ్నిప్రమాదంలో ఐదుగురు సజీవ సమాధి అవ్వగా.. గాయపడిన మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో
ఏలూరు : ఏపీలోని ఏలూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జిల్లాలోని అక్కిరెడ్డిగూడెంలో ఉన్న పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలోని నాల్గవ యూనిట్ లో గత రాత్రి సుమారు 10 గంటల సమయంలో రియాక్టర్ పేలిపోయింది. దాంతో ఫ్యాక్టరీలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. మరో 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని.. రెండున్నర గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు.
కాగా.. అగ్నిప్రమాదంలో ఐదుగురు సజీవ సమాధి అవ్వగా.. గాయపడిన మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన 13 మంది క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఒకరు మినహా మిగతా వారి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో మొత్తం 18 మంది ఉండగా.. వారిలో ఇద్దరు కెమిస్టులు, 16 మంది కార్మికులు ఉన్నట్లు గుర్తించారు. మృతుల్లో ఇద్దరు స్థానికులు కాగా.. మిగతా వారంతా బీహార్ కు చెందినవారని తెలిపారు. క్షతగాత్రుల్లో కూడా అధికంగా బీహారీలే ఉన్నారని పేర్కొన్నారు.