కరోనా నయం చేస్తానని నమ్మంచి.. 13 ఏళ్ల బాలికతో వ్యభిచారం
నెల్లూరు, విజయవాడ, ఒంగోలు ఇలా ఎక్కడపడితే అక్కడికి తీసుకెళ్లి బలవంతంగా వ్యభిచారం చేయించడంతో బాలిక తీవ్ర అనారోగ్యానికి
ఏడు నెలల క్రితం ఓ బాలికకు కరోనా సోకడంతో.. నయం చేస్తానని నమ్మించిన ఒక మహిళ బలవంతంగా ఆ బాలికతో వ్యభిచారం చేయించింది. బాలిక తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో నిర్వాహకులు ఆమె వదిలేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా పల్నాడులో జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. పల్నాడులో ఉంటున్న ఓ కుటుంబాన్ని కరోనా చుట్టేసింది. 7 నెలల క్రితం భార్య, కూతురికి కరోనా సోకడంతో.. ఇద్దరినీ చికిత్స నిమిత్తం బాలిక తండ్రి జీజీహెచ్ లో చేర్పించాడు. భార్య చికిత్స పొందుతూ చనిపోయింది. దాంతో బాలికకు తండ్రే దిక్కయ్యాడు. స్వర్ణభారతి నగర్ కు చెందిన ఓ మహిళ తాను ఓ నర్సునని, బాలికకు త్వరగా నయం చేస్తానని తండ్రిని నమ్మించింది. నాటువైద్యంతో కరోనా నయమవుతుందని నమ్మించిన మహిళ.. బాలికను తన ఇంటికి తీసుకెళ్లింది.
బలవంతంగా వ్యభిచారం
కొద్దిరోజులు అనుమానం రాకుండా ఏవో మందులు ఇచ్చింది. ఆ తర్వాత వ్యభిచారం చేయాలని బాలికపై ఒత్తిడి తెచ్చింది. తనకు ఇష్టం లేదని ఎంత చెప్పినా వినలేదు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు తీసుకెళ్లి వ్యభిచారం చేయించింది. నెల్లూరు, విజయవాడ, ఒంగోలు ఇలా ఎక్కడపడితే అక్కడికి తీసుకెళ్లి బలవంతంగా వ్యభిచారం చేయించడంతో బాలిక తీవ్ర అనారోగ్యానికి గురైంది. దాంతో ఆ బాలికను నిర్వాహకురాలు విజయవాడలో వదిలి పరారయింది. ఆ తర్వాత బాలిక తన ఇంటికి చేరింది.
తండ్రే వ్యభిచారకూపంలోకి నెట్టాడా ?
ఇదిలా ఉండగా..గుంటూరులోని ఓ ఫ్యాక్టరీలో వాచ్ మెన్ గా పనిచేస్తున్న తండ్రి.. తన కూతురు మిస్ అయినట్లు నల్లపాడులో రెండు నెలల క్రితం కంప్లైంట్ ఇచ్చాడు. కూతురు కనిపించడంలేదని ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక నెల్లూరులో ఉన్నట్లు తెలియడంతో కేసు మూసేశారు కానీ.. బాలికను మాత్రం అదుపులోకి తీసుకోలేదు. దీనికి వెనుక ఉన్న రహాస్యాలు ఏంటి? బాలికను తండ్రే ఆ మహిళకు అప్పగించాడా ? ఈ రెండు నెలలు బాలిక ఎవరిచెరలో ఉంది ? అనే ప్రశ్నలకు పోలీసులకు సమాధానం దొరకడం లేదు. బాలిక చెప్పిన ఆధారాలతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గుంటూరు సౌత్ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి తెలిపారు. ప్రస్తుతం బాలికకు వైద్య పరీక్షలు చేయిస్తున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఆమె పేర్కొన్నారు.