మాజీ ఎమ్మెల్యే నారాయణ రెడ్డికి యావజ్జీవ కారాగార శిక్ష
1998 జూన్‌లో టాటా స్టీల్‌కు స్టీల్ ప్లాంట్ కోసం భూసేకరణపై జరిగిన ఘర్షణలో పోలీసు ఇన్‌స్పెక్టర్ మృతి
1998 జూన్‌లో టాటా స్టీల్‌కు స్టీల్ ప్లాంట్ కోసం భూసేకరణపై జరిగిన ఘర్షణలో పోలీసు ఇన్‌స్పెక్టర్ మృతి చెందిన కేసులో సీపీఐ మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి నారాయణరెడ్డికి ఒడిశాలోని జిల్లా కోర్టు సోమవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. పోలీస్ ఇన్‌స్పెక్టర్ బినోబా మెహెర్ మరణంలో నాగిరెడ్డి ప్రమేయం ఉందని బెర్హంపూర్‌లోని అదనపు జిల్లా జడ్జి (ADJ)-3 కోర్టు అభిప్రాయపడింది. ఆయనతో పాటూ.. 12 మందికి శిక్షను ఖరారు చేస్తూ తీర్పును ప్రకటించింది. 2004-2009 వరకు చత్రాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన నారాయణ రెడ్డి.. ఈ తీర్పును ఉన్నత న్యాయస్థానాల్లో సవాలు చేస్తామని చెప్పారు.
జూన్ 18, 1998న సింధిగావ్ గ్రామంలో ఓ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో మెహర్ మృతి చెందారు. అనంతరం నారాయణ రెడ్డితో పాటు మరో 22 మందిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయగా, వీరిలో ఇప్పటికే ఎనిమిది మంది చనిపోయారు. ఆ సమయంలో భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళనకు నాయకత్వం వహించిన కార్మిక సంఘం నాయకుడుగా నారాయణ రెడ్డి ఉన్నారు.
టాటా స్టీల్, ఆగస్టు 1995లో గంజాంలోని గోపాల్‌పూర్‌లో స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా ఒడిషా ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సుమారు 3,000 ఎకరాల భూమిని సేకరించింది. ఈ వివాదాల కారణంగా కంపెనీ తమ ప్లాన్‌ను రద్దు చేసింది.