విషాదం.. పెన్సిల్ షేవింగ్స్ గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
అన్షిక, అభిషేక్ ఈ విషయాన్ని కింద ఉన్న తల్లిదండ్రులకు చెప్పగా.. వెంటనే ఆర్తికను ఆస్పత్రికి తీసుకెళ్లారు.
పెన్సిల్ షేవింగ్స్ గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల చిన్నారి మృతి చెందిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. బుధవారం (డిసెంబర్ 21) సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. హమీర్ పూర్ కొత్వాలి ప్రాంతంలోని పహాడీ వీర్ గ్రామంలో నందకిషోర్ అనే వ్యక్తి భార్య ముగ్గురు పిల్లలతో నివాసముంటున్నాడు. బుధవారం సాయంత్రం కుమారుడు అభిషేక్ (12), కూతురు అన్షిక (8), ఆర్తిక (6)లు టెర్రస్పై కూర్చుని చదువుకుంటున్నారు. 1వ తరగతి చదువుతున్న ఆర్తిక హోంవర్క్ చేసేందుకు తన నోటిలో షార్ప్ నర్ పెట్టుకుని పెన్సిల్ తిప్పింది.
ఈ క్రమంలో..షార్పనర్ నుండి వచ్చిన పెన్సిల్ షేవింగ్స్ బాలిక నోటిలోకి వెళ్లి.. శ్వాసనాళంలో చిక్కుకున్నాయి. బాలిక ఊపిరాడక నేలపై పడిపోయింది. అన్షిక, అభిషేక్ ఈ విషయాన్ని కింద ఉన్న తల్లిదండ్రులకు చెప్పగా.. వెంటనే ఆర్తికను ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ.. అప్పటికే ఆర్తిక మరణించిందని వైద్యులు తెలిపారు. ఆర్తిక మరణంతో.. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పాప మృతదేహానికి పోస్టుమార్టమ్ చేసేందుకు తల్లిదండ్రులు నిరాకరించారని వైద్యులు తెలిపారు. ఇంట్లో ఉండే పిల్లలపై నిఘా ఉంచాలని వైద్యులు సూచించారు. పెన్ను, పెన్సిళ్లు వాడేటపుడు దగ్గరుండి చూసుకోవాలని తెలిపారు.