సినిమా స్ఫూర్తితో ఆస్తి కోసం నానమ్మను చంపిన మనువడు
ఓ యువకుడు ఆస్తికోసం.. మలయాళ సినిమా స్ఫూర్తితో నానమ్మను.. తన తండ్రితో కలిసి అతి కిరాతకంగా చంపేశాడు.
సినిమా ప్రభావం ప్రేక్షకులపై ఎంతోకొంత ఉంటుంది. అది మంచికైతే ఫర్వాలేదు కానీ.. సినిమాల్లో చూపించే చెడు నేర్చుకుంటేనే ప్రమాదం. ఓ యువకుడు ఆస్తికోసం.. మలయాళ సినిమా స్ఫూర్తితో నానమ్మను.. తన తండ్రితో కలిసి అతి కిరాతకంగా చంపేశాడు. ఈ ఘటన మహారాష్ట్ర పూణె లోని కేశవ్ నగర్ లో జరిగింది. ఉషా విఠల్ గైక్వాడ్ (64) దేహురోడ్ లోని ఆర్మీ క్యాంపస్ లో పనిచేసి, రిటైర్డ్ అయ్యారు. ఆ తర్వాత కేశవ్ నగర్ లో స్థిరపడ్డారు. ఆమెతో పాటు కొడుకు, కోడలు, మనువడు కూడా ఆ ఇంట్లోనే కలిసి ఉండేవారు. అత్త కోడళ్ల మధ్య గొడవ ఎక్కడైనా సహజమే. ఇక్కడ కూడా అత్త కోడలు తరచూ గొడవపడేవారు.
ఈ క్రమంలో ఆగస్టు 5న మరోసారి గొడవ జరుగగా.. కోడలు ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అదేరోజు మధ్యాహ్నం ఉష నిద్రపోతుండగా మనవడు సాహిల్ (20) ఆమె గొంతు నులిమి హతమార్చాడు. ఆ తర్వాత మృతదేహాన్ని మాయం చేసేందుకు తండ్రితో కలిసి ప్లాన్ వేశాడు. చెట్లను నరికే ఎలక్ట్రిక్ కట్టర్ ఉష మృతదేహాన్ని ముక్కలు చేసి సంచుల్లోవేశారు. వాటిని కారులో తీసుకెళ్లి ముథా నదిలో పడేశారు. ఆ పక్కనే ఉన్న చెత్త డిపోలో మరో బ్యాగును వదిలేసి, రక్తంతో తడిచిన కత్తి, దుస్తులను నది ఒడ్డున పడేశారు.
చేసిందంతా చేసి.. ఆగస్టు 10న తమ ఇంట్లో పెద్దావిడ కనిపించడం లేదంటూ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులకు.. ఉష కుమార్తె.. తనకు తన అన్నపై అనుమానం ఉందని చెప్పడంతో.. పోలీసులు ఆ దిశగా విచారణ చేశారు. అప్పుడే అసలు విషయం బయపడింది. నానమ్మ ఆస్తిపై కన్నేసిన మనువడు.. ఆమెను చంపేస్తే ఆస్తంతా తనకే దక్కుతుందన్న దురాశతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. ప్రస్తుతం ఆ తండ్రీకొడుకులు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు.