లింగమార్పిడి ఆపరేషన్ చేసిన విద్యార్థులు.. యువకుడి మృతి
లింగమార్పిడి ఆపరేషన్ వికటించి ఒక యువకుడు మృతి చెందిన సంఘటన నెల్లూరులో జరిగింది. బీఫార్మసీ విద్యార్థులు ఆపరేషన్ చేశారు
నెల్లూరు : ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీకాంత్ చిన్న తనం నుంచి తాను ఆడపిల్లగా మారాలని భావించేవాడు. హైదరాబాద్ లో తాపీ పని చేసే శ్రీకాంత్ కొద్దిరోజుల నుంచి ఒంగోలులోనే ఉంటున్నారు. 2019లో శ్రీకాంత్ కు తన మేనమామ కూతురితో వివాహమయింది. అయితే వివాహం ఇష్టంలేని శ్రీకాంత్ 2020లో భార్యతో విడాకులు తీసుకున్నాడు. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నాడు. అయితే శ్రీకాంత్ కు విశాఖపట్నంకు చెందిన ట్రాన్స్‌జెండర్ మోనాలీసా అలియాస్ అశోక్ తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలసి తిరిగే వారు. ఈ నేపథ్యంలో నెల్లూరులోని ఒక ప్రయివేటు కళాశాల బీఫార్మసీ విద్యార్థులతో శ్రీకాంత్ కు పరిచయం అయింది.
ఎక్కువ ఖర్చవుతుందని....
ముంబయి వెళ్లి లింగమార్పిడి చేయించుకోవాలంటే ఎక్కువ ఖర్చవుతుందని భావించిన శ్రీకాంత్ బీఫార్మసీ విద్యార్థులను సంప్రదించాడు. తనకు పరిచయమైన బీఫార్మసీ విద్యార్థులు మస్తాన్, జీవాలు తాము ఆపరేషన్ చేస్తామని, తక్కువ ఖర్చవుతుందని చెప్పడంతో ఈనెల 23వ తేదీన నెల్లూరు వచ్చాడు. నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ లో ఎస్ఎస్ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకుని శ్రీకాంత్ అలియాస్ అమూల్యకు మర్మాంగాలను తొలగించారు. అధికరక్తస్రావమై శ్రీకాంత్ మరణించాడు. దీంతో లాడ్జి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.