కరీంనగర్లో కుటుంబ మరణాల కేసులో వీడుతోన్న మిస్టరీ.. వ్యాధి కాదు, చేతబడి కాదు..
మరణించిన భార్య మమత, కూతురు అమూల్య, కొడుకు అద్వైత్ ల మృతదేహాల నుండి తీసిన శాంపిల్స్ ను టెస్టులకు..
కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో బిడ్డలతో పాటు భార్య, భర్త రోజుల వ్యవధిలో మరణించడం సంచలనం రేపింది. ఆ కుటుంబమంతా అలా కనుమరుగై పోవడంతో.. స్థానికంగా తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. గ్రామస్తులు తొలుత ఎవరో చేతబడి చేసి ఉంటారని అనుకున్నారు. వైద్యులు అంతుచిక్కని వ్యాధి ఏదో సోకిందని భావించారు. కానీ చివరికి.. ఆ కుటుంబ పెద్ద అయిన శ్రీకాంత్ మరణంతో ఒక క్లూ దొరికింది. డిసెంబర్ 31న అతడు సోడియం హైడ్రాక్సైడ్ గుళికలు మింగి మరణించినట్లు పోస్టుమార్టమ్ లో తేలింది.
దాంతో.. పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. మరణించిన భార్య మమత, కూతురు అమూల్య, కొడుకు అద్వైత్ ల మృతదేహాల నుండి తీసిన శాంపిల్స్ ను టెస్టులకు పంపగా.. వారికి ఆర్సనిక్ హైలెవల్ డోస్ ఇచ్చినట్లు తేలింది. ఈ రసాయనాన్ని బ్యాటరీలు, దోమల నివారణ మందు తయారీల్లో వినియోగిస్తారు. కానీ.. వారికి కెమికల్ ఎవరిచ్చారు ? భర్త శ్రీకాంతే ఇదంతా చేశాడా ? ప్రయోగమా ? మర్డర్లా ? శ్రీకాంత్ కాకపోతే ఎవరు ఈ పని చేసి ఉంటారు ? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది.
శ్రీకాంత్ ఎమ్మెస్సీ బయోటెక్నాలజీలో పీజీ చేశాడు. ఓ ప్రైవేట్ కాలేజీలో ఫుడ్ సైన్స్ లెక్చరర్ గా పని చేశాడు. కెమికల్స్ ఎలా పని చేస్తాయన్న దానిపై అతడికి అవగాహన ఉంది. దీంతో శ్రీకాంత్ తన భార్య ఇద్దరు పిల్లలపై రసాయన ప్రయోగాలు చేసి ఉంటాడనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా.. గంగాధరలో 33 రోజుల వ్యవధిలో తల్లి మమత, ఇద్దరు పిల్లలు అమూల్య, అద్వైత్ రక్తపు వాంతులు చేసుకుని చనిపోవడంతో.. అంతుచిక్కని వ్యాధిగా భావించారు. కొందరు చేతబడి జరిగి ఉంటుందని అనుకున్నారు.