కొంప ముంచిన సోషల్ మీడియా స్నేహం.. రూ.12 లక్షలు స్వాహా

బాధితురాలి ఫిర్యాదు మేరకు కపూర్ బావడి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2023-03-17 14:31 GMT

Woman Losts rs 12 lakhs

సోషల్ మీడియాలో పరిచయాలు స్నేహాలుగా మారి.. అది మితిమీరడంతో చాలామంది చాలారకాలుగా నష్టపోతున్నారు. వాటిలో ప్రధానంగా.. సైబర్ మోసాలకు బలవుతున్నవారే అధికం. తాజాగా మహారాష్ట్రలోని థానే నగరంలో మరో సైబర్ మోసం వెలుగుచూసింది. ముంబాయికి చెందిన ఓ మహిళ సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తి మాయమాటల్లో మునిగిపోయి ఏకంగా రూ.12 లక్షలకు పైగా నగదును పోగొట్టుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర థానే నగరానికి చెందిన 36 ఏళ్ల మహిళ సైబర్ మోసగాళ్ల మాయలోపడి రూ.12 లక్షలకు పైగా డబ్బును పోగొట్టుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కపూర్ బావడి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 420 కింద చీటింగ్ కేసు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఒకరు నవంబర్ 2022 నుంచి బాధిత మహిళతో సోషల్ మీడియాలో స్నేహం చేస్తున్నాడు. తాను మలేషియాకు చెందినవాడినని, యూకేలో ఉద్యోగం చేస్తున్నానని మహిళను నమ్మించాడు. యూకే నుంచి ఆమెకు కొన్ని గిఫ్ట్‌లు పంపిస్తున్నట్లు సోషల్‌ మీడియాలో మెసేజ్ లు పంపాడు.
కొన్నిరోజుల క్రితం ఢిల్లీలో కస్టమ్స్ అధికారినంటూ మరో వ్యక్తి బాధిత మహిళకు ఫోన్ చేశాడు. కస్టమ్స్‌ నుంచి గిఫ్ట్‌ పార్శిల్‌లను పంపేందుకు కొంత డబ్బు చెల్లించవల్సి ఉంటుందని, కొంత మొత్తంలో విదేశీ కరెన్సీ కూడా వచ్చిందని చెప్పాడు. అతను చెప్పిందంతా నిజమేనని అనుకున్న బాధిత మహిళ రూ.12.47 లక్షలను సైబర్ నేరగాళ్లు చెప్పిన ఖాతాకు పంపింది. ఆ తర్వాత ఎన్నిరోజులైనా బహుమతులు రానేలేదు. తాను మోసపోయినట్లు గ్రహించిన మహిళ పోలీసులను ఆశ్రయించగా.. పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.



Tags:    

Similar News