ఆన్లైన్ లోన్ వేధింపులు.. యువకుడి ప్రాణం ఖరీదు రూ.8 వేలు
కుప్పలు తెప్పలుగా వచ్చిన ఆన్లైన్ లోన్ యాప్ లకు మధ్యతరగతి కుటుంబాలు బలవుతున్నాయి. అవసరానికి లోన్ తీసుకుని, సమయానికి..
హైదరాబాద్ : కరోనా సమయంలో మొదలైన ఆన్లైన్ లోన్ యాప్ నిర్వాహకుల అరాచకాలు ఇంకా కొనసాగుతున్నాయి. కుప్పలు తెప్పలుగా వచ్చిన ఆన్లైన్ లోన్ యాప్ లకు మధ్యతరగతి కుటుంబాలు బలవుతున్నాయి. అవసరానికి లోన్ తీసుకుని, సమయానికి కట్టలేక.. ఇంతలో యాప్ నిర్వాహకులు పెట్టే టార్చర్ భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా మరో యువకుడు ఆన్ లైన్ లోన్ యాప్ నిర్వాకానికి బలయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జియాగూడకు చెందిన రాజ్ కుమార్ అనే యువకుడు కుటుంబ అవసరాల నిమిత్తం ఆన్‌లైన్ లోన్ యాప్ నుంచి రూ. 12 వేలు లోన్‌గా తీసుకున్నారు.
తిరిగి రూ.4 వేలు చెల్లించాడు. ఇంకా రూ.8 వేలు చెల్లించాల్సి ఉంది. కాగా.. లోనే తీసుకునే ప్రాసెస్ లో తన స్నేహితుల ఫోన్ నంబర్లను రిఫరెన్స్ గా పెట్టడమే అతడి ప్రాణాలమీదికి వచ్చింది. తీసుకున్న మొత్తం చెల్లించకపోవడంతో రాజ్ కుమార్ స్నేహితులకు లోన్ యాప్ నిర్వహకుల మేసేజ్‌లు పెట్టారు. దీంతో మానసికంగా కృంగిపోయిన రాజ్‌కుమార్.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.