మెడికల్ స్టూడెంట్ అక్షిత అనుమానాస్పద మృతిపై వీడిన చిక్కుముడి
ములుగు జిల్లా మంగపేటకు చెందిన అక్షిత (26) ఎంబీబీఎస్ పూర్తిచేసి కర్ణాటకలోని చిక్కబల్లపుర మెడికల్ కాలేజీలో పీజీ చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని ఓ లాడ్జిలో తెలంగాణాకు చెందిన వైద్య విద్యార్థిని అక్షిత బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. పోలీసుల దర్యాప్తులో అక్షిత మృతిపై మిస్టరీ వీడింది. పోలీసులు అక్షితది హత్యగా నిర్థారించారు. అక్షితతో పాటు ఉన్న స్నేహితుడు, ప్రియుడు మహేశ్ వర్మ ఆమెను గొంతునులిమి హతమార్చినట్లు ప్రాథమికంగా నిర్థారించారు.
టౌన్ సిఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు.. ములుగు జిల్లా మంగపేటకు చెందిన అక్షిత (26) ఎంబీబీఎస్ పూర్తిచేసి కర్ణాటకలోని చిక్కబల్లపుర మెడికల్ కాలేజీలో పీజీ చేస్తోంది. భర్త వరంగల్ లో ఆర్థోపెడిక్ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. ఆమె తన స్నేహితుడైన సంగారెడ్డి జిల్లా పటాన్చెరుకు చెందిన మహేష్ వర్మ (25)తో కలిసి బుధవారం ఉదయం హిందూపురం వచ్చి ఓ లాడ్జిలో దిగారు. సాయంత్రానికి అక్షిత చనిపోయినట్లు ఆ యువకుడు పోలీసులకు ఫోన్ చేసి తెలిపాడు. మధ్యాహ్నం భోజనం చేసి తామిద్దరం నిద్ర పోయామని, లేచి చూస్తే ఆమె చనిపోయి ఉందని తెలిపాడు. పోలీసులు అక్షిత బంధువులకు సమాచారం ఇచ్చి అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా... అసలు విషయం చెప్పాడు.
విచారణలో మహేష్ స్నేహితుడు కాదని, ప్రియుడని తేలింది. హైదరాబాద్‌లో ఇంటీరియర్ డిజైనర్‌గా పని చేస్తున్న మహేష్.. అక్షితతో తనకు సంబంధం ఉందని ఒప్పుకున్నాడు. లాడ్జిలో ఆమెను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులకు వెల్లడించాడు. అక్షితను ఎందుకు చంపాడన్న విషయం ఇంకా తెలియలేదు. కాగా.. అక్షితకు పెళ్లై ఒక పాప కూడా ఉన్నట్లు తెలిసింది.