బాబోయ్ డ్రగ్స్.. రూ.900 కోట్ల హెరాయిన్ కలకలం
డ్రగ్ రాకెట్ దేశమంతా విస్తరిస్తోంది. పలుచోట్ల వందల కోట్ల రూపాయల డ్రగ్స్ పట్టుబడుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
దేశంలో మరోమారు డ్రగ్స్ కలకలం రేగింది. వందల కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు పట్టుబడడం ఒక్కసారిగా అలజడి రేపింది. యూపీలోని ముజఫర్‌నగర్‌లో ఎన్సీబీ నిర్వహించిన సోదాల్లో 900 కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ లభ్యమైంది. గుజరాత్ తీరం నుంచి భారీగా డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కొద్దిరోజుల కిందట ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో పట్టుబడిన డ్రగ్ పెడ్లర్లు ఇచ్చిన సమాచారంతో ఎన్సీబీ, ఏటీఎస్ అధికారులు జాయింట్ ఆపరేషన్ చేశారు. ముజఫర్‌నగర్‌లో భారీగా డ్రగ్స్ ఉన్నాయనే సమాచారంతో ఓ గోడౌన్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వందల కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు లభ్యమయ్యాయి. పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అంత పెద్దమొత్తంలో డ్రగ్స్ లభ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది.
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోనూ ఈరోజు భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. సుమారు 80 కోట్లు రూపాయల విలువైన కొకైన్‌లను డీఆర్ఐ అధికారులు గుర్తించారు. విదేశీ ప్రయాణికులు తమ బ్యాగ్ అడుగు భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంటైనర్‌లో డ్రగ్స్ పెట్టుకుని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న యువతులను టాంజానియా, అంగోలా దేశస్తులుగా గుర్తించారు. ఇటీవల కాలంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి భారీగా బంగారం, డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతున్న ఘటనలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ నగరంలోనూ డ్రగ్ కల్చర్ విపరీతంగా పెరుగుతోంది. రేవ్ పార్టీలు, పబ్బుల్లో డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఇటీవల పోలీసు తనిఖీల్లో తేలింది.