గర్భా నృత్యం చేస్తూ ఒకరు.. పాటలు పాడుతూ మరొకరు హఠాన్మరణం
కోరాపుఠ్ జిల్లాకు చెందిన మురళి ‘ఖోకా భాయ్’గా అందరికీ సుపరిచితం. మురళీ ప్రసాద్ గత కొంతకాలంగా హృదయ సంబంధిత..
ఒడిశాలో జరుగుతున్న దసరా ఉత్సవాలు విషాదాంతమయ్యాయి. జయపురంలోని జగత్ జనని ఆలయంలో ఏర్పాటు చేసిన సంగీత విభావరిలో పాటలు పాడుతూ గాయకుడు మురళీ ప్రసాద్ మహాపాత్రా (59) హఠాన్మరణం చెందారు. రెండు పాటలు పాడి.. విశ్రాంతి తీసుకుంటూ ఉన్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు, కళాకారులు, శ్రోతలు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు.
కోరాపుఠ్ జిల్లాకు చెందిన మురళి 'ఖోకా భాయ్'గా అందరికీ సుపరిచితం. మురళీ ప్రసాద్ గత కొంతకాలంగా హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు సోదరుడు బిభూతి ప్రసాద్ మహాపాత్రా తెలిపారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా విరార్ పట్టణంలో జరిగిన మరో ఘటనలో మనీశ్ నర్జాపీ (35) గర్భా నృత్యం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అతడు చనిపోయినట్లు తెలిపారు వైద్యులు. కొడుకు మరణవార్త విని తండ్రి సోనిగ్రా ఆస్పత్రిలో కుప్పకూలి మరణించారు. కాగా.. తండ్రి కొడుకుల మరణానికి కారణాలు తెలియరాలేదు.