లోన్ తీసుకోనివారినీ వేధిస్తోన్న నిర్వాహకులు
బాధితురాలి ఇంటికి వెళ్లిన దిశ పోలీసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొద్దిరోజుల క్రితం గుర్తుతెలియని నంబర్ నుండి..
వ్యక్తిగత అవసరాలు లేదా.. కుటుంబ అవసరాల నిమిత్తం ఆన్ లైన్ లోన్ యాప్ లలో లోన్లు తీసుకున్నవారిని సదరు ఏజెంట్లు ఎలా వేధిస్తుంటారో చూస్తూనే ఉన్నాం. తీసుకున్న మొత్తానికి బదులుగా తిరిగి అధిక సొమ్ము చెల్లించినా.. ఇంకా డబ్బు కట్టాలంటూ ఫోన్లు, మెసేజ్ లు చేసి.. న్యూడ్ ఫొటోలు మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడగా.. చాలా మంది బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. అయితే లోన్ తీసుకున్న వారికే కాదు.. తీసుకోని వారినీ లోన్ యాప్ నిర్వాహకులు వేధిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన తూర్పు గోదావరి జిల్లా కడియంలో చోటుచేసుకుంది.
కడియం మండలంలో నివాసం ఉండే దేవి అనే మహిళ మే27న దిశ SOS కు కాల్ చేసి తనను లోన్ యాప్ నిర్వాహకుడు వేధిస్తున్నట్టుగా సమాచారం ఇచ్చింది. బాధితురాలి ఇంటికి వెళ్లిన దిశ పోలీసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొద్దిరోజుల క్రితం గుర్తుతెలియని నంబర్ నుండి తనకు 2000 రూపాయలు ఫోన్ పే ద్వారా వచ్చాయని, వెంటనే అదే నంబర్ కు అమౌంట్ తిరిగి పంపినట్లు దేవి పోలీసులకు తెలిపింది. అప్పటి నుంచి అదే నెంబర్ నుండి సదరు వ్యక్తి వాట్సాప్ కాల్స్ చేస్తూ.. హిందీ, ఇంగ్లీషు భాషల్లో మాట్లాడుతూ వేధింపులకు పాల్పడుతున్నట్లు బాధితురాలు వాపోయింది. తనకు అదనంగా డబ్బు చెల్లించాలని లేదంటే.. ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బాధితురాలిని బెదిరించాడు.
ఆగంతకుడు చెప్పిన విధంగానే బాధితురాలి ఫొటోలను మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫొటోలను పంపించడం మొదలు పెట్టాడు. అగంతకుడి వేధింపులు శృతిమించడంతో బాధితురాలు దిశా పోలీసులకు కాల్ చేసి సమాచారం ఇచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, అతను కాల్ చేసిన ఫోన్ నంబర్ ఇతర వివరాల ఆధారంగా కడియం పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. ఎవరైనా అజ్ఞాత వ్యక్తులు ఫోన్ చేసి వేధింపులకు పాల్పడితే వెంటనే దిశా SOS కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు పోలీసులు సూచించారు.