బీఫార్మసీ విద్యార్థిని తేజస్విని రీ పోస్టుమార్టం, రిపోర్ట్‌లో ఏముంది?

అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బీఫార్మసీ విద్యార్థిని తేజస్విని డెడ్‌బాడీకి రీపోస్టుమార్టం నిర్వహించారు.

Update: 2022-05-06 10:17 GMT

ఏపీలో సంచలనంగా మారిన సత్యసాయి జిల్లా బీఫార్మసీ విద్యార్థిని తేజస్విని అనుమానాస్పద మృతి కేసు మలుపులు తిరుగుతోంది. ఆమె తల్లిదండ్రులు తమ బిడ్డను గ్యాంగ్ రేప్ చేసి చంపేశారని ఆరోపిస్తున్నారు. తిరుపతిలో కాలేజీ హాస్టల్లో ఉన్న తమ కూతురిని తీసుకొచ్చి హత్యాచారం చేశారని ఆందోళనకు దిగారు. తాము రాకుండానే పోస్టుమార్టం చేశారని ఆమె తండ్రి ఆరోపించారు.

అత్యాచారం ఆరోపణలు రావడంతో తేజస్విని డెడ్‌బాడీకి రీ పోస్టుమార్టం నిర్వహించారు. రీ పోస్టుమార్టం రిపోర్ట్‌లో తేజస్వినిపై అత్యాచారం జరగలేదని.. ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం. శుక్రవారం వచ్చిన రిపోర్టుల్లో ఆమెపై అత్యాచారం జరిగిన ఆనవాళ్లు లేవని ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఆమె ముఖంపై ఉన్న గాయాలపై స్పష్టత రావాల్సి ఉంది.

బీఫార్మసీ విద్యార్థిని తేజస్విని, అదే పట్టణానికి చెందిన సాదిక్ గత కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ తరచూ ఫోన్‌లో మాట్లాడుకునే వారని తెలుస్తోంది. సాదిక్ ఫోన్ చేసి రమ్మనడంతో ఆమె తన ఇటుక బట్టీలు తయారు చేసే స్థలంలో ఉన్న షెడ్డుకి వచ్చింది. రాత్రి 10 గంటల వరకూ అక్కడే ఉన్నారని.. భోజనం తీసుకొచ్చేందుకు సాదిక్ బయటికెళ్లిన సమయంలో ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు.

తమ కుమార్తె డెడ్‌బాడీ సాదిక్ షెడ్డులో దొరకడం.. తాము రాకుండానే పోస్టుమార్టం చేశారంటూ మృతురాలి తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. గ్యాంగ్ రేప్ చేసి చంపేశారంటూ బంధువులు, స్థానికులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అత్యాచారం జరగలేదని.. యువతి మృతిపై మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.

Tags:    

Similar News