వైశాలి కిడ్నాప్ కేసు : అంతా కావాలనే చేశానన్న నవీన్, పోలీసుల విచారణలో నిజాలు
ఆరు నూరైనా.. నూరు నూటపదహారైనా సరే.. వైశాలిని పెళ్లిచేసుకోవాలని కుట్రలు పన్నాడట. తనకు వైశాలికి పెళ్లి అయిపోయిందంటూ ..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఆదిభట్ల మన్నెగూడ బీడీఎస్ విద్యార్థిని వైశాలి కిడ్నాప్ కేసులో.. రిమాండ్ లో ఉన్న నవీన్ రెడ్డిని విచారించగా సంచలన నిజాలు వెల్లడయ్యాయి. నవీన్ రెడ్డి కావాలనే వైశాలి, ఆమె కుటుంబంపై ఆరోపణలు చేసినట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. వైశాలితో తన పెళ్లికి ఆమె తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతోనే.. ఇదంతా చేసినట్లు నవీన్ నేరాన్ని ఒప్పుకున్నాడట.
ఆరు నూరైనా.. నూరు నూటపదహారైనా సరే.. వైశాలిని పెళ్లిచేసుకోవాలని కుట్రలు పన్నాడట. తనకు వైశాలికి పెళ్లి అయిపోయిందంటూ తప్పుడు పత్రాలు సృష్టించిన నవీన్.. వాటి ద్వారా అమ్మాయి తల్లిదండ్రులకు నోటీసులు పంపాడు. ఇంతలో ఎన్ఆర్ఐతో వైశాలికి పెళ్లి కుదిరిందని తెలుసుకున్న నవీన్.. ఆ పెళ్లిని చెడగొట్టేందుకే అమ్మాయిని కిడ్నాప్ చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు. వైశాలి తన భార్య అని పనివాళ్లకి అబద్ధం చెప్పి.. వారిని తప్పతాగించి ఆమె ఇంట్లో బీభత్సం సృష్టించాలని చెప్పానన్నాడు. వైశాలి తండ్రిని చంపాలన్న ఉద్దేశ్యంతోనే దాడిచేసినట్లు తెలిపాడు.
కాగా.. ఇటీవల నవీన్ తల్లి మీడియాతో మాట్లాడుతూ.. తనకొడుకు చేసింది తప్పే అయినా.. అందులో న్యాయం ఉందన్నారు. వైశాలి-నవీన్ కలిసి తిరిగారని, ఆమె పెళ్లికూడా చేసుకుంటానందని చెప్పారు. వీరి ప్రేమకు మొదట ఒప్పుకున్న యువతి తల్లిదండ్రులు.. ఆ తర్వాత తమ నిర్ణయాన్ని మార్చుకున్నారన్నారు. వైశాలికి ఫారెన్ సంబంధం చూస్తున్నారని తన కొడుకు అన్నాడని తెలిపింది. యువతికి నవీన్ అంటే ఇష్టమున్నా.. అతడిని పెళ్లాడితే కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించి బలవంతంగా మరో పెళ్లికి ఒప్పించారని ఆరోపించారు. నాలుగు రోజుల క్రితం నవీన్ కూడా తనపై వస్తున్న నెగిటివిటీ గురించి వీడియో విడుదల చేశాడు. ఇదే ఓ అమ్మాయి ఒకరిని ప్రేమించి, అతను మోసం చేస్తే ఇలాగే స్పందిస్తారా అని ప్రశ్నించాడు.