లారీని ఢీ కొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
బస్సు డ్రైవర్ నిద్రమత్తుతో డ్రైవ్ చేయడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. అతివేగంతో వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు..
పల్నాడు జిల్లాలోని దాచేపల్లి వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ ఢీ కొట్టిన ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. మరో 10 మంది స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కందుకూరు నుండి ఒంగోలు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది.
బస్సు డ్రైవర్ నిద్రమత్తుతో డ్రైవ్ చేయడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. అతివేగంతో వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. లారీని వెనుక నుంచి ఢీ కొట్టడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడినవారిని మెరుగైన వైద్యం కోసం గుంటూరు ఆసుపత్రికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలీసులు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.