ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య.. 5 మంది అరెస్ట్
ఆత్మహత్య కేసుకు సంబంధించి పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో మరికొందరి పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు
జైపూర్‌లోని డూడూ బ్లాక్‌లో శనివారం ముగ్గురు అక్కాచెల్లెళ్లు, వారి ఇద్దరు పిల్లలు శవాలై తేలిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆత్మహత్య కేసుకు సంబంధించి పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో మరికొందరి పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు కాలు దేవి భర్త నర్‌సింగ్, మమత భర్త జగదీష్, కమలేష్ భర్త ముఖేష్, అత్తమామలు సంతోష్, జెతాని మీనాదేవిలను వరకట్నం, హత్య, వరకట్న వేధింపుల ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు మీడియాకు తెలిపారు.
అసలేం జరిగిందంటే:
రాజస్థాన్ రాష్ట్రంలో ఘోరం చోటు చేసుకుంది. జైపూర్ జిల్లాలోని ఓ బావిలో శనివారం నాడు ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. చనిపోయిన మహిళలు తోబుట్టువులని తేలింది. కాలు దేవి, మమత, కమలేష్ లు అక్కా చెలెళ్ళని గుర్తించారు. ముగ్గురు మహిళలు కాలు దేవి(27), మమతా(23) దేవి, కమలేష్(20) అక్కాచెల్లెల్లుగా గుర్తించారు. నాలుగేళ్ల చిన్నారి, 27 రోజుల శిశువును కాలుదేవి పిల్లలుగా గుర్తించారు. ముగ్గురు అక్కాచెల్లెల్లు బాల్య వివాహ బాధితులే అని తెలుస్తోంది.
పెద్దగా చదువుకోని, మద్యం అలవాటు ఉన్న ముగ్గురు అన్నదమ్ములకిచ్చి వీరి వివాహాలు చేశారు. మమతా దేవి, కమలేష్ ఇద్దరూ నిండు గర్భిణులు కావడం.. కాలు దేవి కేవలం నెల రోజుల క్రితమే ప్రసవించింది. కష్టపడి చదువుకుని జీవనం సాగించాలనుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లను మద్యం మత్తులో ఉండే వ్యక్తులకు ఇచ్చి పెళ్లి చేసినట్లు సమాచారం. అది కూడా బాల్య వివాహం అని తేలింది. వీరు బుధవారం నాడు అదృశ్యమయ్యారు. వారిని వెతకడంలో పోలీసులు విఫలమయ్యారు. ముగ్గురు మహిళలు గృహహింసకు గురైనట్లు సమాచారం.
కాలు దేవిని అత్తమామలు కొట్టడంతో.. 15 రోజులు క్రితం ఆసుపత్రి పాలైంది. వారి ముగ్గురికి 2003లో బాల్య వివాహం జరిగింది. ఆ సమయంలో అక్కచెల్లళ్ళలో ఆఖరి అమ్మాయి వయసు కేవలం 1 సంవత్సరం మాత్రమే. ఆ ముగ్గురు మహిళలు తమ బతుకుదెరువు కోసం కష్టపడి చదువుకున్నారు. మమత పోలీసు కానిస్టేబుల్ పరీక్షలో ఎంపికైంది, కాలు తన బిఎ కోర్సు చివరి సంవత్సరం చదువుతోంది. చిన్న చెల్లెలు కమలేష్ సెంట్రల్ యూనివర్సిటీలో చేరింది. అయినా కూడా భర్తలు టార్చర్ పెడుతూనే ఉన్నారు. వారి ఇళ్లకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న బావి నుంచి శనివారం వారి మృతదేహాలను వెలికితీశారు.