Rajkot : ప్రజల ప్రాణాలతో గేమ్సా? ఉసురు తీసిన నిర్లక్ష్యం..రాజ్‌కోట్ ప్రమాదానికి అసలు కారణం ఇదేనట
రాజ్‌కోట్ ప్రమాదం ఊహించని రీతిలో జరిగింది. 27 మంది ఉసురు తీసింది
రాజ్‌కోట్ ప్రమాదం ఊహించని రీతిలో జరిగింది. 27 మంది ఉసురు తీసింది. సాయంత్రం వేళ సరదాగా గడిపేందుకు వెళ్లిన వారికి అది డెత్ గేమింగ్ గా మారింది. గుజరాత్ లోని రాజ్ కోట్ లో నిన్న సాయంత్రం గేమింగ్ జోన్ లో చెలరేగిన మంటలకు 27 మంది మరణించారు. మంటలు వ్యాపించడంతో పై కప్పు కూలడంతో ఈ విషాదం తీవ్రత ఎక్కువయింది. తప్పించుకునే ప్రయత్నమూ ఫలించలేదు. రక్షించడానికి కూడా ఎవరూ సాహసించలేని పరిస్థితి. చుట్టూ మంటలు.. రక్షించడానికి వెళితే తాము మాడి మసై పోతారు. అందుకే ఇంత పెద్దయెత్తులో ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటి వరకూ 27 మృతదేహాలను వెలికి తీశారు. ఇంకా ఉండవచ్చన్న అనుమానాలను వ్యక్తమవుతున్నాయి. మృతుల్లో నలుగురు చిన్నారులున్నారు. మృతదేహాలను గుర్తించడం కూడా కష్టంగా మారింది. చిన్నారులతో సాయంత్రం వేళ సరదాగా వచ్చిన వారి పాలిట గేమింగ్ జోన్ శాపంగా మారింది. మృత్యువు వారితో ఆడుకున్నట్లయింది.