అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు వద్ద జాతీయ రహదారిపై
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ట్రాక్టర్ ను అతివేగంతో ప్రైవేట్ ట్రావెల్ వోల్వో బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌లో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు పసలురు శ్రీరాములు, నాగార్జున, చిన్న తిప్పయ్య, కుమ్మర శ్రీనివాస్‌లుగా గుర్తించారు. మృతులంతా గుత్తి మండలం మామిడూరుకు చెందిన వారిగా గుర్తించారు. ఓ రైస్ మిల్లు నుంచి ట్రాక్టర్ లోకి బియ్యం బస్తాలు వేసుకుని తిరిగి గుత్తి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వోల్వో బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
తెలంగాణ రాష్ట్రంలోని ఖాజాగూడలో అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో డిప్లొమా విద్యార్థి మృతిచెందగా నలుగురు గాయపడ్డారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం, ఎర్రగడ్డ తండాకు చెందిన బానోత్ శ్రీరామ్(20), చందానగర్ గంగారంవాసి ఉదయ్ సాయి(18), మణికొండలో ఉండే దితేశ్(17), నారాయణ్‌ఖేడ్‌కు చెందిన వర్షిత్(18), జోగిపేటవాసి వంశీ(19) జోగిపేటలోని ప్రభుత్వ కళాశాలలో డిప్లొమా ఫైనల్ చదువుతున్నారు. శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో కారులో ఖాజాగూడ పద్మనాభ గుట్టకు వచ్చారు. గుట్ట అందాలను వీక్షించాక ఖాజాగూడ పెద్దచెరువు రోడ్డు నుంచి తిరిగి బయల్దేరారు. కారు డ్రైవింగ్ చేస్తున్న ఉదయ్ వేగంగా నడపడంతో ఎస్కీ సమీపంలో కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో పల్టీలు కొట్టి డివైడర్‌కు అవతలివైపు పడింది. డ్రైవరు పక్క సీటులో కూర్చున్న శ్రీరామ్ కారులోంచి నేలపై పడిపోయి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. క్షతగాత్రులను సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.