జోరుగా ఎర్రచందనం స్మగ్లింగ్.. రూ.80 లక్షల విలువైన దుంగలు స్వాధీనం

తాజాగా రాజంపేట, తిరుపతి జిల్లాల్లోని మూడు ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించగా..

Update: 2023-07-16 09:20 GMT

RS 80 lakhs worth red sandal woods

ఎర్రచందనం స్మగ్లింగ్ కు అడ్డుకట్ట వేసేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎక్కడికక్కడ కూంబింగ్ నిర్వహిస్తున్నా.. స్మగ్లర్లు మాత్రం వారి కళ్లుగప్పి ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారు. తాజాగా రాజంపేట, తిరుపతి జిల్లాల్లోని మూడు ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించగా.. 20 మంది స్మగ్లర్లు పట్టుబడ్డారు. వారి నుంచి రూ.50 లక్షల విలువైన 19 ఎర్రచందనం దుంగలు, ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మురళీధర్ వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియా వారితో నిర్వహించిన సమావేశంలో వివరాలను వెల్లడించారు. తమ హెచ్ఓడీ, కర్నూలు రేంజి డీఐజీ సెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు ఆర్ఐ కే.సురేష్ కుమార్ రెడ్డికి చెందిన మూడు ఆర్ఎస్ఐలు సురేష్ బాబు, వై.విశ్వనాథ్, కేఎస్కే. లింగాధర్ టీమ్ లు తిరుపతి టాస్క్ ఫోర్సు కార్యాలయం నుంచి మూడు ప్రాంతాలకు కూంబింగ్ చేపట్టారని తెలిపారు.

అన్నమయ్య జిల్లా తుమ్మలబైలు సెక్షన్ చాకిరేవు సమీపంలోని అటవీ ప్రాంతంలో ఒకటీమ్, అన్నమయ్య జిల్లా సానిపాయ రేంజి ఫింఛా సెక్షన్ దిన్నెల ఫారెస్టు బీటు, చిట్టికురవ రాస్తా కోన సమీపంలోని నిషేధిత అటవీ ప్రాంతానికి రెండో టీమ్, మూడో టీమ్ తిరుపతి జిల్లా నాగపట్ల సెక్షన్లోని తిరుపతి పీలేరు రోడ్డులో గల వెంకట పద్మావతీ ఇనిస్టిట్యూట్ కళాశాల ఎదరుగా ఉన్న అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలు మోసుకెళ్తూ పట్టుబడ్డారని, వారిని టాస్క్ ఫోర్స్ చుట్టిముట్టి అరెస్ట్ చేశారని వివరించారు. పట్టుబడిన స్మగ్లర్లు 20 మంది తమిళనాడుకు చెందినవారుగా గుర్తించామన్నారు.
వేలూరు జిల్లా ఆనైకట్టు తాలూకాకు చెందిన రమేష్ (42), సురేష్ సాంబశివం (38), నవీన్ వెంకటేశన్ (23), సెంగోదరన్ మునిస్వామి (29), తిరువన్నామలై జమునామత్తూరుకు చెందిన కొళందై చిన్నపయ్యన్ (50), కల్లకురిచ్చి జిల్లాకు చెందిన ఏలుమలై (33), సామికన్ను పచ్చయ్యన్ (37), గణేశన్ పిచ్చన్ (28), అనంతరామన్ (19), అన్బు పచ్చన్ (40),అళగేషన్ కుమారస్వామి (36), సెంథిల్ రామన్ (30), తిరుపత్తూరు జిల్లాకు చెందిన వెంకటేశన్ కాళి (34),రంగనాథన్ పెరుమాళ్ (39), అదే జిల్లా ఆంబూరు తాలూకాకు చెందిన మురళి మురుగన్ (24), ఎల్లియన్ (57), వేలు రత్నం (36), ముత్తురామన్ చిన్నపయ్యన్ (40), దామోదరం రాజా (46), సత్యవేలు రత్నం (27) లుగా గుర్తించినట్లు తెలిపారు. వీరిని అరెస్టు చేసి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ కు తరలించారు.
కడప పరిధిలో మరో ఏడుగురి అరెస్ట్, 32 దుంగలు స్వాధీనం
కడప సబ్ కంట్రోల్ పరిధిలో శనివారం నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్ లో ఏడుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేసి 32 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మురళీధర్ తెలిపారు. ఆర్ఐ చిరంజీవులుకు చెందిన రెండు టీమ్ లు ఆర్ఎస్ఐ నరేష్ కు చెందిన టీమ్ గోపవరం పిపికుంట రిజర్వు ఫారెస్టులో శుక్రవారం నుంచి కూంబింగ్ నిర్వహిస్తుండగా.. బ్రాహ్మణపల్లి వద్ద ఎర్రచందనం దుంగలు తీసుకెళ్తున్న వ్యక్తులను గుర్తించారు. వారిని చుట్టుముట్టి ముగ్గురు స్మగ్లర్లను అరెస్ట్ చేసి, 19 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన స్మగ్లర్లు కడప జిల్లా గోవపరం మండలం పీపీకుంటకు చెందిన శివ (40), ఓబులేసు (60), చెన్నయ్య(55)లుగా గుర్తించారు. అలాగే.. ఆర్ఎస్ఐ రాఘవేంద్ర టీమ్ చింతలకుంట ఫారెస్టు బీటులోని బీడిబావి సెక్షన్ లో కూంబింగ్ చేస్తుండగా, కొందరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలను మోసుకుని వెళుతూ కనిపించారు. వీరిని చుట్టుముట్టగా వారిలో నలుగురిని పట్టుకున్నారు. వారిని అన్నమయ్య జిల్లా నందలూరు మండలానికి చెందిన కనకదుర్గయ్య (51), నరసింహులు (43) రాజంపేట మండలం పి. వెంకటేశు (35), కోడూరు మండలం పరుశురాం (35)లుగా గుర్తించారు. వారి నుంచి 13 ఎర్రచందనం దుంగలు, ఒక మోటారు సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి విలువ సుమారు రూ.30 లక్షల వరకూ ఉంటుందని డీఎస్పీ మురళీధర్ వివరించారు.


Tags:    

Similar News