హైదరాబాద్ లో సీరియల్ కిల్లర్ అరెస్ట్

ఈ సీరియల్‌ కిల్లర్‌ హైదరాబాద్‌లోని నేతాజీనగర్‌, దుర్గానగర్‌ చౌరస్తా, కాటేదాన్‌ ప్రాంతాల్లో తిరుగుతూ వరుస హత్యలకు పాల్పడి

Update: 2023-06-23 01:43 GMT

సైబరాబాద్‌ కమిషనరేట్‌లోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లోని క్రైమ్‌వింగ్‌ పోలీసులు కరుడుగట్టిన సీరియల్‌ కిల్లర్‌ బ్యాగారి ప్రవీణ్‌ను పట్టుకున్నారు. హైదరాబాద్ జనాలను టెన్షన్ పెట్టిన సైకో కిల్లర్ ఇతడేనని చెబుతున్నారు. వారం రోజుల వ్యవధిలో మూడు హత్యలకు పాల్పడి నగరం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించిన హంతకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించి సీరియల్‌ కిల్లర్‌ను అరెస్ట్‌ చేశారు. ఇంకా ఎవరినైనా చంపేశాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం రాజేంద్రనగర్‌ సర్కిల్‌ మైలార్‌ దేవుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మెయిన్‌ రోడ్లపై జరిగిన జంట హత్యలు కలకలం సృష్టించాయి మైలార్‌ దేవుపల్లి పోలీస్‌ స్టేషన్‌కు అతి సమీపంలో రెండు హత్యలు జరిగాయి. రోడ్డు పక్కన దుప్పట్లు అమ్ముకునే వ్యక్తిని, షాప్‌ ముందు నిద్రిస్తున్న మరో వ్యక్తిని హంతకుడు గ్రానైట్‌ రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఈ హత్యలు జరిగిన 12 గంటల్లోనే హంతకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సీరియల్‌ కిల్లర్‌ హైదరాబాద్‌లోని నేతాజీనగర్‌, దుర్గానగర్‌ చౌరస్తా, కాటేదాన్‌ ప్రాంతాల్లో తిరుగుతూ వరుస హత్యలకు పాల్పడినట్లు పోలీసులు జరిపిన విచారణలో బయట పడింది. రోడ్డు పక్కన పడుకుంటున్న వారే లక్ష్యంగా హతమారుస్తున్నట్లు గుర్తించారు.

రాజేంద్రనగర్, మాణిక్యమ్మ కాలనీకి చెందిన ప్రవీణ్ కూలీ పనిచేస్తుంటాడు. వ్యసనాలకు బానిసగా మారడంతో ఇళ్లల్లో స్నేహితులతో కలిసి గతంలో ఇళ్లల్లో చోరీలు చేసేవాడు. తన స్నేహితులతో కలిసి 2011లో ఓ మహిళపై అత్యాచారం చేసి ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, డబ్బులు తీసుకుని పారిపోయారు. చైన్‌స్నాచింగ్, రాబరీ, చోరీలు, హత్యలు చేశాడు. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇటీవలే జైలు నుంచి విడుదలైన నిందితుడు ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని టార్గెట్‌గా చేసుకుని హత్యలు చేసి వారి వద్ద ఉన్న సొత్తును తీసుకుని పారిపోతున్నాడు. వరుసగా హత్య కేసులు నమోదు కావడంతో మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చేపట్టారు. సిసి కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించి నిందితుడిని గుర్తించారు. ప్రవీణ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.


Tags:    

Similar News