లోయ‌లో ప‌డిన బ‌స్సు.. ఏడుగురు దుర్మ‌ర‌ణం

ఉత్తరాఖండ్‌లో రాష్ట్రం నైనిటాల్-కలాధుంగి రహదారిలో ఘోర ప్ర‌మాదం సంభ‌వించింది.

Update: 2023-10-09 01:54 GMT

ఉత్తరాఖండ్‌లో రాష్ట్రం నైనిటాల్-కలాధుంగి రహదారిలో ఘోర ప్ర‌మాదం సంభ‌వించింది. రాత్రి 7.15 గంటలకు జిమ్ కార్బెట్ మ్యూజియం కూడలికి దాదాపు 13 కి.మీ ముందు.. హర్యానాలోని హిసార్ నుండి పర్యాటకులతో వెళ్తున్న బస్సు 150 మీటర్ల లోతులో ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి, ఐదుగురు మహిళలు సహా ఏడుగురు మృతి చెందగా, 21 మంది గాయపడ్డారు. ప్ర‌మాద స‌మ‌యంలో బస్సులో 28 మంది ఉన్నారు. సమాచారం అందుకున్న ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌ఎస్‌పి ప్రహ్లాద్ నారాయణ్ మీనా సహా ఎస్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం హల్ద్వానీకి తరలించారు.

హిసార్‌లోని ఆర్యనగర్‌లోని న్యూ మానవ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉపాధ్యాయులు తమ కుటుంబ స‌భ్యుల‌తో కలిసి స్కూల్ బస్సులో నైనిటాల్ వెళ్లారు. తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కలాధుంగి-నైనిటాల్ రోడ్డులోని నల్నీ ఘాట్‌గఢ్ సమీపంలో బస్సు అదుపు తప్పి 150 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ప్ర‌మాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులు చెల్లాచెదురుగా పడిపోయారు. లోయ‌లో నుంచి జనం కేకలు వేయడంతో బాటసారులు పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన వారిని సుశీల తివారీ ఆసుపత్రికి త‌ర‌లించారు.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను రక్షించి కాలువలో నుంచి బయటకు తీసి చికిత్స నిమిత్తం కలదుంగిలోని సీహెచ్‌సీకి తరలించారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందినట్లు ఎస్‌డిఎం పరితోష్ వర్మ తెలిపారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఎస్‌ఎస్పీ ప్రహ్లాద్ నారాయణ్ మీనా తెలిపారు.


Tags:    

Similar News