ప్రవళిక ఆత్మహత్య కేసులో నిందితుడు శివరాం రాథోడ్ కు బెయిల్ వచ్చింది. పోలీసులు శనివారం నాడు నిందితుడు శివరాం రాథోడ్ నాంపల్లి కోర్టు లో ప్రవేశపెట్టారు. గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం నిందితుడిని పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన కోర్టు శివరాం రాథోడ్ రిమాండ్ కు అనుమతించింది. ప్రవళిక ఆత్మహత్య కేసులో సరైన సాక్షాధారాలు లేనందున నాంపల్లి కోర్టు నిందితుడు బెయిల్ ఇచ్చింది. రూ. 5000 వ్యక్తిగత పూచికత్తుతో శివరాంను విడిచి పెట్టాలని పోలీసులను నాంపల్లి కోర్టు ఆదేశించింది.
శివరాంను పోలీసులు శుక్రవారం నాడు అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లి కోర్టులో లొంగిపోయేందుకు వచ్చిన శివరాం సరెండర్ పిటిషన్ వేశాడు. ప్రవళిక ఆత్మహత్య కేసు దర్యాప్తులో ఉందని, కేవలం ఎఫ్ఐఆర్ ఆధారంగా రిమాండ్ విధించలేమంటూ శివరాం వేసిన పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. అనంతరం పోలీసులు నాంపల్లి కోర్టు ప్రాంగణంలోనే శివరాంను అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకుంటానని శివరాం నమ్మించి మోసం చేయడంతోనే ప్రవళ్లిక ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు. ప్రవళిక ఆత్మహత్యకు సంబంధించి శివరాంపై 417, 420, 306 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శివరాం అనే యువకుడి వేధింపులతోనే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రవళిక తల్లి విజయ ఆరోపించారు. ప్రవళికను శివరాం ప్రేమ పేరుతో వేధించాడని.. వాడి టార్చర్ భరించలేక మా అమ్మాయి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని వాపోయారు.