చైన్ స్నాచింగ్స్ కేసు.. ఏయే సమయాల్లో చైన్ స్నాచింగ్ లు జరిగాయంటే..
ఉప్పల్ లో మొదలైన చైన్ స్నాచింగ్ లు సికింద్రాబాద్ వరకూ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా.. దుండగులు ముఖాలు..;
హైదరాబాద్ లో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. రెండు గంటల సమయంలో ఏకంగా ఆరు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ లకు పాల్పడి.. ప్రజలను హడలెత్తించారు. బైక్ లపై వచ్చిన వారంతా మహిళల మెడల్లోని గొలుసులను లాక్కొని పరారయ్యారు. ఉప్పల్ లో మొదలైన చైన్ స్నాచింగ్ లు సికింద్రాబాద్ వరకూ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా.. దుండగులు ముఖాలు కనిపించకుండా మాస్క్ లు ధరించి స్నాచింగ్ లకు పాల్పడటంతో వారిని గుర్తించే పనిలో ఉన్నామన్నారు. ఈ స్నాచింగ్ లకు పాల్పడింది ఒక ముఠాకు చెందినవారే కావొచ్చని.. వారిని పట్టుకునేందుకు 12 బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు తెలిపారు.
ఉప్పల్ లోని రాజధాని కాలనీలో ఉదయం 6:20 గంటలకు మొదటి స్నాచింగ్ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత కల్యాణ్ పురిలో ఉదయం 6:40 గంటలకు రెండో ఘటన, నాచారంలోని నాగేంద్రన్ కాలనీలో ఉదయం 7:10 గంటలకు మూడో చోరీ, ఓయూ పరిసరాల్లోని రవీంద్రనగర్ లో ఉదయం 7:40 గంటలకు నాలుగో చోరి, చిలకలగూడ రామాలయం వీధిలో ఉదయం 8 గంటలకు ఐదో చోరీ, రాంగోపాల్ పేట్ పరిధిలో ఉదయం 8:10 గంటలకు ఆరవ చోరీలు జరిగినట్లు వివరించారు. ఉదయం వేళల్లో వాకింగ్ కు వెళ్లే మహిళలు, బయట పనిచేసుకునే మహిళలే టార్గెట్ గా దుండగులు రెచ్చిపోయారు. దుండగుల ముఠా ఢిల్లీకి చెందినదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. నగరంలోని వృద్ధులు, మహిళలు అప్రమత్తంగా ఉండాలని, ఉదయం వేళల్లో ఒంటరిగా బయటకు రావొద్దని పోలీసులు సూచించారు.