ప్రయాణికులపైకి దూసుకెళ్లిన లారీ.. ఆరుగురి దుర్మరణం
రక్తపు మరకలతో చెల్లాచెదరుగా పడిన ఉన్న మృతదేహాలతో ఘటనాస్థలం భీతావహంగా మారింది. సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్..
బస్సుకోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులపైకి లారీ దూసుకెళ్లింది. మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ ఘోర రోడ్డుప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. రత్లాం జిల్లాలో జరిగిన ఈ ఘటన తాలూకా వివరాల్లోకి వెళ్తే.. సత్రుండ సమీపంలోని రత్లాం-ఇండోర్ ఫోర్ లైన్ రోడ్డుపై కొందరు ప్రయాణికులు బస్సుకోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో అటువైపుగా లోడుతో వేగంగా వెళ్తున్న లారీ టైర్ పగిలిపోయి అదుపుతప్పి ప్రయాణికులమీదికి దూసుకెళ్లింది.
ఈ ఘోర ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా.. మరో 12 మంది తీవ్రగాయాల పాలయ్యారు. రక్తపు మరకలతో చెల్లాచెదరుగా పడిన ఉన్న మృతదేహాలతో ఘటనాస్థలం భీతావహంగా మారింది. సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అధికారులు, పోలీసులు గాయపడినవారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరగవచ్చని అధికారులు తెలిపారు. కాగా.. ప్రమాదం అనంతరం ట్రక్కును వదిలిపెట్టి డ్రైవర్ పరారయ్యాడు. ఈ ఘటనపై రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.