ఉద్యోగం కోసం యూఎస్ వెళ్లి.. ప్రమాదంలో శ్రీకాకుళం యువకుడు మృతి
సంతబొమ్మాళి మండలంలోని ఎం.సున్నాపల్లి గ్రామానికి చెందిన రవి..నౌకలో పనిచేసేందుకు మరో 10 మందితో కలిసి..
ఇటీవల కాలంలో అమెరికాలో పలు ప్రమాదాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు మరణిస్తున్నారు. నాలుగురోజుల క్రితం అమెరికాలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో విజయవాడకు చెందిన విద్యార్థి మరణించగా.. తెలంగాణకు చెందిన విద్యార్థి గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రెండ్రోజుల క్రితం సియాటిల్ లో కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన జాహ్నవి అనే యువతిని పోలీస్ వాహనం ఢీ కొట్టడంతో తీవ్రగాయాలతో మృతి చెందింది. తాజాగా మరో ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందాడు.
ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన టి. రవికుమార్(35) మూడ్రోజుల క్రితమే ఉద్యోగంలో చేరాడు. సంతబొమ్మాళి మండలంలోని ఎం.సున్నాపల్లి గ్రామానికి చెందిన రవి..నౌకలో పనిచేసేందుకు మరో 10 మందితో కలిసి ఈ నెల 17న అమెరికా వెళ్లాడు. మూడు రోజుల క్రితం అక్కడ సీమన్‌గా ఉద్యోగంలో చేరాడు. బుధవారం సాయంత్రం విధుల్లో ఉండగా ప్రమాదవశాత్తు కంటెయినర్ పై నుండి జారిపడడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కంపెనీ ప్రతినిధులు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయగా.. విషయం వెలుగుచూసింది. రవికుమార్‌కు భార్య శ్రావణి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అతని మరణవార్తతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.