భీమ్లా నాయక్ టికెట్ కు డబ్బులివ్వలేదని.. బాలుడు ఆత్మహత్య !
తాజాగా భీమ్లా నాయక్ సినిమా ఓ బాలుడి ఆత్మహత్యకు పరోక్షంగా కారణమైంది. సినిమా టికెట్ అడ్వాన్స్ గా బుక్ చేసుకుందామని
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - రానా దగ్గుబాటి నాయకుడు , ప్రతి నాయకుడి పాత్రల్లో నటించిన సినిమా భీమ్లా నాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. చిత్ర బృందం ప్రమోషన్లలో బిజీ అవుతోంది. వకీల్ సాబ్ వంటి హిట్ సినిమా తర్వాత పవన్ కల్యాణ్ హీరోగా వస్తోన్న సినిమా ఇదే. ఈ సినిమా కోసం పవన్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత.. పవన్ మళ్లీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. పవన్ సినిమా అంటే.. ఫ్యాన్స్ హడావిడి మాములుగా ఉండదు. అడ్వాన్స్ బుకింగ్ లతోనే హౌస్ ఫుల్ అవుతాయి థియేటర్లు.
తాజాగా భీమ్లా నాయక్ సినిమా ఓ బాలుడి ఆత్మహత్యకు పరోక్షంగా కారణమైంది. సినిమా టికెట్ అడ్వాన్స్ గా బుక్ చేసుకుందామని భావించాడు ఓ బాలుడు. జగిత్యాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి అయిన నవదీప్ (11) భీమ్లా నాయక్ సినిమా టికెట్ అడ్వాన్స్ బుకింగ్ కోసం తన తండ్రిని రూ.300 అడిగాడు. తన స్నేహితులంతా అడ్వాన్స్ గా టికెట్లు బుక్ చేసుకుంటున్నారని, తాను కూడా ముందుగానే టికెట్ బుక్ చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. తండ్రి చివాట్లు పెట్టి.. డబ్బులివ్వలేదు. దాంతో మనస్తాపం చెందిన నవదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక సినిమా కోసం క్షణికావేశంలో ఆ విద్యార్థి చేసిన పని.. ఆ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.