'ఇంగ్లిష్‌' కష్టాలు.. కుక్కతో ఒళ్లంతా కరిపించి.. దారుణం

ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు దారుణ అనుభవం ఎదురైంది. ఇకపై ఢిల్లీకి రానని టాటూ ఆర్టిస్ట్ భయపడిపోతున్నాడు.

Update: 2022-05-11 14:23 GMT

ఇంగ్లిష్ కష్టమంటే ఇదేనేమో.. కేవలం ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు ఓ వ్యక్తికి ఢిల్లీలో దారుణ అనుభవం ఎదురైంది. జాత్యాహంకార దూషణలకు దిగడమే కాకుండా అతనిపై దాడి చేశాడు. అంతటితో ఆగని ప్రబుద్ధుడు తన పెంపుడు కుక్కను అతని మీదకు వదిలేశాడు. ఈ దారుణ ఘటన దేశరాజధాని ఢిల్లీలో జరిగింది. డెహ్రాడూన్‌కి చెందిన అన్షుమన్ తాపా టాటూ ఆర్టిస్ట్. దక్షిణ ఢిల్లీలోని మాల్వియా నగర్‌లో ఉండేవాడు. గత శుక్రవారం రాత్రి వాటర్ బాటిల్స్, అవసరమైన వస్తువులు తెచ్చుకునేందుకు దగ్గర్లోని ఓ దుకాణానికి వెళ్లాడు.

షాపు ఓనర్‌తో ఇంగ్లిష్‌లో తనకేం కావాలో చెప్తున్నాడు. ఇంతలో అక్కడికి అదే ప్రాంతానికి చెందిన కైఫ్ అనే వ్యక్తి వచ్చాడు. తాపా మాట్లాడుతుండగా ఇంగ్లిష్‌తో తననేదో తిడుతున్నాడని భావించి రెచ్చిపోయాడు. అతన్ని కొట్టుకుంటూ బయటికి లాక్కొచ్చాడు. నేపాలీ అంటూ దూషణలకు దిగాడు. తాను డెహ్రాడూన్‌ అని చెబుతున్నా పట్టించుకోలేదు. అతన్ని దారుణంగా కొట్టడమే కాకుండా తన పెంపడు కుక్కను తాపా పైకి వదిలాడు. కుక్క మీదపడి ఒళ్లంతా కరిచేసింది.

తల వెనక, మెడపై, ఒక చెవి దాదాపు ఊడిపోయేల కొరికేసింది. చిన్న శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ఈ భయంకర ఘటనపై తాపా మాల్వియా నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న తాపా కుటుంబ సభ్యులు డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి వచ్చారు. ఇక ఇక్కడ ఉండొద్దని చెప్పి అతన్ని సొంతూరుకి తీసుకెళ్లారు. ఈ దారుణ ఘటనతో ఇకపై ఢిల్లీకి రాబోనని తాపా చెబుతున్నాడు. తన ప్రాణం పోతుందేమోనని కుటుంబ సభ్యులు భయపడుతున్నారని.. ఢిల్లీకి వచ్చే ఉద్దేశం లేదని చెప్పాడు. ఒకవేళ వచ్చినా మాల్వియా నగర్‌లో మాత్రం ఉండనని తెగేసి చెప్పేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Tags:    

Similar News