మద్యం తాగి లేడీ టీచర్ బడిలో పాఠాలు చెబుతూ?
లిక్కర్ తాగి పాఠాలు చెబుతూ విద్యార్థులను అకారణంగా కొడుతున్న ఒక ఉపాధ్యాయురాలిని అధికారులు సస్పెండ్ చేశారు
లిక్కర్ తాగి పాఠాలు చెబుతూ విద్యార్థులను అకారణంగా కొడుతున్న ఒక ఉపాధ్యాయురాలిని అధికారులు సస్పెండ్ చేశారు. కర్ణాటకలో ఈ సంఘటన జరిగింది. కర్ణాటకలోని తుముకూరు తాలూకా చిక్కసారంగి ప్రాధమిక పాఠశాలలో గత 25 ఏళ్లుగా గంగలక్ష్మమ్మ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆమె ఐదేళ్ల నుంచి మద్యానికి బానిస అయ్యారు. పాఠశాలకు మద్యం తాగి వచ్చి విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు. పాఠశాలకే మద్యం బాటిళ్లను తెచ్చుకుని అక్కడే సేవించేవారు. మద్యం మత్తులో పాఠశాల విద్యార్థులను చితకబాదేవారు.
సస్పెండ్ చేసి విచారణకు....
విద్యార్థులను కొట్టడంతో పాటు తోటి టీచర్లతో నూ గొడవలకు దిగేవారు. దీంతో స్థానికులు ఆమె ఆగడాలకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. ఉన్నతాధికారులు దీనిపై విచారణకువచ్చారు. తాలుకా విద్యాధికారి హనుమా నాయక్ వచ్చి పాఠశాలలో ఆమె గదిని పరిశీలించే ప్రయత్నం చేశారు. ఆమె టేబుల్ డ్రాను తెరుస్తుండగా తాళాలు వేసి ఉన్నాయి. తాళాలు అడిగితే గంగలక్ష్మమ్మ ఇవ్వలేదు. దీంతో స్థానికులు దానిని పగులకొట్టే ప్రయత్నం చేయగా రూములోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. పోలీసులు వచ్చి ఆమెను బయటకు తీసుకు వచ్చారు. ఆమె టేబుల్ డ్రాలో మద్యం సీసాతో పాటు ఖాళీ సీసాలు కనిపించడంతో ఉన్నతాధికారులు అవాక్కయ్యారు. ఉపాధ్యాయురాలు గంగలక్ష్మమ్మను సస్పెండ్ చేసిన అధికారులు విచారణకు ఆదేశించారు.