చాక్లెట్ దొంగతనం వీడియో వైరల్.. మనస్తాపంతో యువతి బలవన్మరణం
మృతురాలు అలీపుర్‌దూర్ జిల్లా జైగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ పల్లిలో గ్రాడ్యుయేట్ మూడో సంవత్సరం..
కాలేజీ విద్యార్థిని ఓ షాపింగ్ మాల్ లో చాక్లెట్లు దొంగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరలైంది. ఆ వీడియో చూసిన సదరు యువతి మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడిన ఘటన పశ్చిమబెంగాల్ లోని అలీపుర్ దూర్ జిల్లాలో చోటుచేసుకుంది. చిన్న విషయానికే యువతి బలవన్మరణానికి పాల్పడటం స్థానికులను కలచివేసింది. అందుకు కారణమైన షాపింగ్ మాల్ ఎదుట నిరసన తెలిపారు. వీడియో తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మృతురాలు అలీపుర్‌దూర్ జిల్లా జైగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ పల్లిలో గ్రాడ్యుయేట్ మూడో సంవత్సరం చదువుతోంది. సెప్టెంబర్ 29న తన సోదరితో కలిసి.. అక్కడున్న ఓ షాపింగ్ మాల్ కు వెళ్లింది. షాపింగ్ మాల్ నుండి బయటికి వస్తుండగా.. చాక్లెట్లు దొంగిలిస్తూ పట్టుబడింది. షాప్ యాజమానికి క్షమాపణలు చెప్పి.. చాక్లెట్ కు డబ్బులు చెల్లించింది. కాగా.. ఆ ఘటనను అక్కడున్న వ్యక్తులు వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అదికాస్తా వైరల్ అయింది.
తన వీడియో వైరల్ అవడంతో.. మనస్తాపానికి గురైన యువతి.. ఆదివారం తన ఇంట్లో ఉరివేసుకుని బలన్మరణం చెందింది. దీంతో స్థానికులు షాపింగ్ మాల్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. వీడియో తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించినట్లు జైగావ్ ఇన్‌ఛార్జ్ అధికారి ప్రబీర్ దత్తా పేర్కొన్నారు.