పెళ్లికి ఒప్పుకోలేదని.. యూనివర్సిటీలో యువతి హత్య
దాంతో లయపై కక్ష పెంచుకున్న పవన్ ఆమెను చంపేందుకు సిద్ధమయ్యాడు. సోమవారం (జనవరి 2) ఆమె చదువుకుంటున్న..
ఇద్దరిదీ ఒకే ఊరు. బంధువులు కూడా. దాంతో ఆ యువకుడు యువతిపై ఇష్టం పెంచుకున్నాడు. విషయం తన తల్లిదండ్రులకు చెప్పి.. యువతి తల్లిదండ్రులతో పెళ్లివిషయం మాట్లాడమన్నాడు. పెళ్లికి యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దాంతో తనకు దక్కనిది ఎవరికీ దక్కకూడదనుకుని ఆ యువతి పై కత్తితో దాడి చేసి హతమార్చాడు. అనంతరం తాను ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ దుర్ఘటన కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న ప్రైవేటు యూనివర్సిటీకి చెందిన ప్రెసిడెన్సీ కాలేజ్ కారిడార్ లో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. లయ స్మిత(19) ప్రెసిడెన్సీ కాలేజ్ లో బీటెక్ 3వ సంవత్సరం చదువుతోంది. పక్కనే ఉన్న కాలేజీలో 21 సంవత్సరాల పవన్ కల్యాణ్ బీసీఏ చదువుతున్నాడు. ఇద్దరిదీ ఒకే ఊరు. బంధువులు కూడా. కొంతకాలంగా పవన్ లయను ఇష్టపడుతున్నాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తన తల్లిదండ్రులకు చెప్పాడు. వాళ్లు లయ తల్లిదండ్రులతో పెళ్లి విషయం మాట్లాడగా.. ససేమిరా కుదరదన్నారు. లయ తల్లి పవన్ కు.. తన కూతురివెంట పడొద్దని వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.
దాంతో లయపై కక్ష పెంచుకున్న పవన్ ఆమెను చంపేందుకు సిద్ధమయ్యాడు. సోమవారం (జనవరి 2) ఆమె చదువుకుంటున్న కాలేజీకి వెళ్లాడు. అక్కడ లయతో కొద్దిసేపు మాట్లాడాడు. పెళ్లి టాపిక్ రావడంతో.. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. పవన్ తనతో తెచ్చుకున్న కత్తితో లయపై దాడి చేసి.. ఆమె ఛాతిలో పొడిచాడు. తర్వాత పవన్ తనను తాను పొడుచుకున్నాడు. ఇద్దరూ కారిడార్ లోనే రక్తపు మడుగులో పడి ఉన్నారు. కొద్దిసేపటికి గమనించిన విద్యార్థులు, కాలేజీ యాజమాన్యం.. ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే లయ మరణించిందని వైద్యులు తెలిపారు. పవన్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.