Heart Attack : క్రిస్మస్ పండగకు ఇంటికి వచ్చి... బాలుడు గుండెపోటుతో మృతి
పదమూడు ఏళ్ల వయసున్న బాలుడు గుండెపోటుతో మరణించిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది.
పదమూడు ఏళ్ల వయసున్న బాలుడు గుండెపోటుతో మరణించిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్‌లో సోమవారం సాయంత్రం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. తాళ్లపల్లి శంకర్, సరిత దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి పేర్లు జశ్వంత్, సుశాంత్ లు. తల్లిదండ్రులిద్దరూ కూలి పనిచేస్తూ ఇద్దరు కొడుకులను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారు. జశ్వంత్ కోనరావుపేట ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతుండగా, సుశాంత్ ముస్తాబాద్ మండలంలోని గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.
ఆసుపత్రికి తరలించే లోగా...
అయితే క్రిస్మస్ పండుగ కోసం సుశాంత్ ఆదివారం హాస్టల్ నుంచి ఇంటికి వచ్చాడు. సోమవారం ఇంట్లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నాడు కూడా. మధ్యాహ్నం ఛాతీలో నొప్పి వస్తున్నదని చెప్పడంతో కుటుంబ సభ్యులు సిరిసిల్ల జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేస్తుండగానే సుశాంత్ మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. గుండెపోటుతోనే సుశాంత్ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. క్రిస్మస్ సంబురాలతో సంతోషం నిండాల్సిన వారి ఇంట్లో ఒక్కసారిగా విషాదం నెలకొంది. పదమూడేళ్లకే గుండెపోటు రావడం ఊహించని విషయమని వైద్యులు అభిప్రాయపడ్డారు.