ఉద్రిక్తతల మధ్య ప్రవళిక అంతిమయాత్ర

తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలు వాయిదా పడడంతో మనస్తాపం

Update: 2023-10-14 06:45 GMT

తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలు వాయిదా పడడంతో మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్‌నగర్‌లో వరంగల్ జిల్లా బిక్కాజీపల్లికి చెందిన మర్రి ప్రవళిక (23) హాస్టల్‌లో ఉంటూ గ్రూప్-2 పరీక్షలకు సన్నద్ధమవుతోంది. నవంబరు 2,3 తేదీల్లో పరీక్షలు జరగాల్సి ఉండగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి 6, 7 తేదీలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాయిదా వేసింది.పరీక్షల కోసం కోచింగ్ తీసుకుంటున్న ప్రవళిక వాయిదా పడడంతో మనస్తాపానికి గురైంది. నిన్న సాయంత్రం హాస్టల్‌లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సహచర విద్యార్థుల సమాచారంతో హాస్టల్‌కు చేరుకున్న పోలీసులు ప్రవళిక మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న విద్యార్థులు ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్నారు.

ఆత్మహత్యకు ముందు ప్రవళిక తల్లిదండ్రులకు రాసినట్టుగా ఉన్న లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. తనను క్షమించాలని, తానో నష్టజాతకురాలినని ఆ లేఖలో ప్రవళిక ఆవేదన వ్యక్తం చేసింది. ‘నా వల్ల మీరెప్పుడూ బాధపడుతూనే ఉన్నారు. మీకు పుట్టడం నా అదృష్టం అమ్మా. నన్ను కాళ్లు కిందపెట్టకుండా చూసుకున్నారు. మీకు నేను చాలా అన్యాయం చేస్తున్నా. నన్ను ఎవరూ క్షమించరు. ఏడవకండి అమ్మా. మీ కోసం నేను ఏమీ చేయలేకపోతున్నా. నాన్న జాగ్రత్త’ అని ఆ లేఖలో ప్రవళిక పేర్కొంది.

హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక అంతిమయాత్ర ప్రారంభమైంది. స్వగ్రామం దుగ్గొండి మండలం బిక్కాజిపల్లిలో అంతిమయాత్ర మొదలైంది. బొక్కాజిపల్లికి చేరుకున్న బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రవళిక మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీ నేతలు నిరసనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొద్దిసేపు ఆ ప్రాంతంలో గందరగోళం చోటు చేసుకుంది. 

Tags:    

Similar News