ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల ఆత్మహత్య
హరికృష్ణకు గుండె సంబంధిత సమస్య ఉండటంతో.. మందులు వాడుతున్నాడు. ఆదివారం(జూన్ 18) కూడా నొప్పి రావడంతో..
ఎదిగిన కొడుకులు.. చదువులు పూర్తి చేసి ఉద్యోగాలు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటారనుకున్న ఆ తల్లిదండ్రుల ఆశలన్నీ అడియాశలయ్యాయి. తన అనారోగ్యంతో కుటుంబానికి భారం అవ్వకూడదని ఒకరు, చెడు వ్యసనాలకు అలవాటుపడి, చేసిన అప్పులు తీర్చలేక, ఇంట్లో చెప్పుకోలేక.. పరువు పోకూడదని మరొకరు.. ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు బలవన్మరణం చెందారు. శంకర్ పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చందిప్ప గ్రామానికి చెందిన కడమంచి విద్యాసాగర్, లలిత దంపతుల రెండో కుమారుడు హరికృష్ణ (21) దుండిగల్ లోని కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు.
హరికృష్ణకు గుండె సంబంధిత సమస్య ఉండటంతో.. మందులు వాడుతున్నాడు. ఆదివారం(జూన్ 18) కూడా నొప్పి రావడంతో.. ఒక్కడే ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నాడు. తల్లిదండ్రులకు భారం కావొద్దని భావించి.. సోమవారం తెల్లవారుజామున పొలంలో చెట్టుకు ఉరివేసుకున్నాడు. అతని జేబులో మిస్ యూ డాడ్.. మిస్ యూ మమ్మీ అని రాసి ఉన్న లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం నెరగోములకు చెందిన ఆంజనేయులు, కల్యాణి దంపతుల కుమారుడు సాయికుమార్ (22) ఘట్ కేసర్ సమీపంలో ఓ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. చెడు వ్యసనాలకు బానిసై అప్పులు చేశాడు. అవి తీర్చలేక, ఇంట్లో చెప్పలేక.. ఆదివారం అర్థరాత్రి ఘట్ కేసర్- బీబీనగర్ రైలు మార్గంలో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.