బాలికపై గ్రామవాలంటీర్ అత్యాచారం
ఇటీవల బాలిక తల్లిదండ్రులు ఇంటిలో లేని సమయంలో ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారం చేశాడు. విషయాన్ని బయటికి చెప్తే..
బొబ్బిల్లంక : ఒంటరిగా ఉన్న బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో వెలుగుచూసింది. ప్రభుత్వ పథకాలు అందజేసేందుకు ఇంటికొచ్చిన గ్రామవాలంటీర్ బాలికపై కన్నేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతానగరం మండలం బొబ్బిల్లంక గ్రామంలో గ్రామ వాలంటీర్ గా పనిచేస్తున్న బూసి సతీష్ (23) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ప్రభుత్వ పథకాల పేరుతో తరచూ బాలిక ఇంటికి వెళ్లొచ్చేవాడు.
ఇటీవల బాలిక తల్లిదండ్రులు ఇంటిలో లేని సమయంలో ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారం చేశాడు. విషయాన్ని బయటికి చెప్తే చంపేస్తానంటూ సతీష్ బాలికను హెచ్చరించాడు. అప్పట్నుంచి బాలిక ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లిదండ్రులు.. అసలు విషయం తెలుసుకుని ఖంగుతిన్నారు. బాలికను ఏం జరిగిందని ప్రశ్నించగా.. అసలు విషయం చెప్పింది. వెంటనే సీతానగరం పోలీసులకు సమాచారం ఇవ్వగా రంగంలోకి దిగిన పోలీసులు గ్రామ వాలంటీర్ సతీష్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సతీష్ ను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.