భార్య ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా.. శాడిస్ట్ భర్త వేధింపులు
చెన్నైలో ఉద్యోగం చేసిన అతను.. ఇటీవల విజయవాడకు ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఈ క్రమంలో యువతికి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి.
తమకు బాగా ఆస్తులున్నాయని నమ్మించి..పెళ్లి చేసుకున్న ఓ శాడిస్ట్ భర్త.. పెళ్లైన తొలిరోజు నుండే వేధించడం మొదలుపెట్టాడు. మధ్యవర్తి ద్వారా తెలంగాణలోని డోర్నకల్ కు చెందిన యువతిని కర్నూల్ జిల్లా నంద్యాలకు చెందిన మహబూబ్ షరీఫ్ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి సమయంలో యువతి తల్లిదండ్రులు రూ.20 లక్షల నగదు, బంగారం, ఇల్లు, స్థలాలు ఏ లోటు లేకుండా ఇచ్చారు. కానీ తొలిరోజు రాత్రి నుండే.. పెళ్లిలో సరైన మర్యాదలు చేయలేదంటూ వేధించడం మొదలుపెట్టాడు శాడిస్ట్ భర్త.
పెళ్లైన మూడో రోజుకే వాళ్లకు ఆస్తులు ఉండటం అబద్ధమని తెలుసుకుని..మోసపోయామని గ్రహించారు యువతి తల్లిదండ్రులు. పెళ్లయ్యాక చేసేదేం లేదని ఊరుకోవడం అతడికి అలుసైంది. ఎన్నిరోజులైనా భార్యను కాపురానికి తీసుకెళ్లలేదు. చెన్నైలో ఉద్యోగం చేసిన అతను.. ఇటీవల విజయవాడకు ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఈ క్రమంలో యువతికి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. గతేడాది అక్టోబర్ 21న అదనపు కట్నం తేవాలని భర్త, అత్తమామలు కొట్టడంతో అబార్షన్ అయిందని బాధిత యువతి వాపోయింది. అబార్షన్ అవడంతో ఆస్పత్రిలో వదిలేసి వెళ్లిపోయారని, రెండ్రోజుల పాటు తనని ఎవరూ పట్టించుకునేవారు లేకపోవడంతో.. తన తల్లిదండ్రులకు ఫోన్ చేశానని తెలిపింది. పటమట పోలీసుల్ని ఆశ్రయించినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మీడియాకు మొరపెట్టుకుంది. ఏడాదిన్నర కాలంలో రెండుసార్లు తనకు అబార్షన్ అయిందని, తనకు న్యాయం చేయాలని కోరింది.