విజయవాడ సనత్ నగర్ లో దారుణం.. మహిళను గదిలో బంధించి మూడ్రోజులుగా..
మొత్తం నలుగురూ బాధిత మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. మూడ్రోజుల పాటు మహిళపై అత్యాచారాలకు పాల్పడటంతో..
విజయవాడలో ఓ మహిళపై జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నలుగురు వ్యక్తులు ఓ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. గతరాత్రి మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈ దారుణం వెలుగులోకొచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని బెంజి సర్కిల్ వద్ద కూలిపనులు చేసుకునే ఓ మహిళను.. అదే ప్రాంతంలో సులభ్ కాంప్లెక్స్ లో పనిచేసే ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి.. డిసెంబర్ 17న ఆమెను కానూరు సనత్ నగర్లోని ఓ గదిలోకి తీసుకెళ్లాడు. ఆమెకు అక్కడ నిర్బంధించి, తన స్నేహితులకు సమాచారమిచ్చాడు.
మొత్తం నలుగురూ బాధిత మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. మూడ్రోజుల పాటు మహిళపై అత్యాచారాలకు పాల్పడటంతో.. ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. సోమవారం ఓ ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు చేరగా.. వైద్యులు ఆమెను పరీక్షించి గతరాత్రి పెనమలూరు పోలీసులకు సమాచారమిచ్చారు. ఆస్పత్రికి వెళ్లిన పోలీసులు.. బాధితురాలితో మాట్లాడి అసలేం జరిగిందో వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితుల కోసం గాలిస్తున్నారు.