నడిరోడ్డుపై అత్తను నరికిన అల్లుడు
వైఎస్సార్ కాలనీ బ్లాక్ నంబర్ 68లో గోగుల గురుస్వామి, నాగమణి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు, కొడుకు ఉన్నారు.;
విజయవాడలో మహిళను అతి కిరాతకంగా హత్య చేశారు. నగర శివారు చనమోలు వెంకట్రావు ఫ్లైఓవర్ వద్ద నడిరోడ్డుపై ఓ మహిళను దారుణంగా హత్య చేయడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అత్తామామలు ఇద్దరినీ చంపేయాలని అనుకున్న అల్లుడి దాడి నుండి మామ తప్పించుకోగా.. అత్త మాత్రం అతడి కత్తికి బలైంది.
జక్కంపూడి జేఎన్‌ఎన్‌యూ ఆర్‌ఎం కాలనీకి చెందిన గొగుల నాగమణి రెండో కుమార్తెతో అల్లుడికి విభేదాలు రావడంతో కోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. అత్తమామలపై కక్ష పెంచుకున్న అల్లుడు రాజేష్ పథకం ప్రకారం వారితో మాట్లాడాలంటూ ఫ్లైఓవర్ ప్రాంతానికి పిలిచాడు. వారు రాగానే ద్విచక్రవాహనంపై ఉన్న మామను నరికేందుకు ప్రయత్నించగా అతను పరారయ్యాడు. అత్త అక్కడి నుండి వెళ్ళిపోలేక పోవడంతో అత్తపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ నాగమణి అక్కడికక్కడే మృతి చెందింది. అత్త చనిపోయినట్లు నిర్ధారించుకున్న తర్వాత నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సంఘటనా స్థలికి చేరుకున్న టూ టౌన్ కొత్తపేట పోలీసులు మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గొడవకు కారణం:
వైఎస్సార్ కాలనీ బ్లాక్ నంబర్ 68లో గోగుల గురుస్వామి, నాగమణి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు, కొడుకు ఉన్నారు. పెద్ద కుమార్తె ఝాన్సీ పాల ఫ్యాక్టరీ వద్ద ఉంటోంది. రెండో కుమార్తె లలిత భర్త కుంభా రాజేష్ తో కలిసి కబేళా వద్ద ఉన్న ఏకలవ్య నగర్‌లో నివాసం ఉండేది. రాజేష్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ఉన్న ఈట్ స్ట్రీట్‌లో పనిచేసేవాడు. రాజేష్, లలితల మధ్య కొద్దికాలంగా వివాదాలు నడుస్తున్నాయి. విడాకులు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ కేసు కోర్టులో తుది విచారణలో ఉంది. వివాదాల కారణంగా లలిత వైఎస్సార్ కాలనీలో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. దీంతో రాజేష్ అత్త మామలపై పగ పెంచుకున్నాడు. వారిని హత మార్చేందుకు గత కొద్దిరోజులుగా ప్రయత్నించాడు. శనివారం రాత్రి అదను చూసుకుని దాడి చేశాడు. మామ పారిపోగా.. నాగమణి అల్లుడి చేతిలో హతమైంది.