లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి
వనపర్తి... కొత్తకోటకు చెందిన శేఖర్ ఇటీవల ఓ లోనన్ యాప్ ద్వారా అవసరానికి కొంత నగదును తీసుకున్నాడు. వాయిదాల పద్ధతిలో..
దీపావళి పర్వదినాన.. దీపకాంతులతో.. నవ్వులతో కళకళలాడాల్సిన ఆ ఇంట్లో లోన్ యాప్ వేధింపులు తీరని విషాదాన్ని నింపాయి. ఆన్లైన్ లోన్ యాప్ వేధింపులు తాళలేక తెలంగాణలో మరో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అడగకుండానే రుణాలు కావాలంటే తీసుకోండి.. ఎలాంటి డాక్యుమెంట్లు అక్కర్లేదంటూ ఆకర్షించి.. తీరా లోన్ తీసుకున్నాక గడువులోపు చెల్లించకపోతే.. మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలతో వేధిస్తున్నారు. ఫలితంగా బాధితులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
వనపర్తి... కొత్తకోటకు చెందిన శేఖర్ ఇటీవల ఓ లోనన్ యాప్ ద్వారా అవసరానికి కొంత నగదును తీసుకున్నాడు. వాయిదాల పద్ధతిలో చెల్లించే క్రమంలో కొంత ఆలస్యమైంది. రోజూ ఫోన్ చేసి వేధింపులకు గురి చేయడం ప్రారంభించారు నిర్వాహకులు. కొద్దిరోజుల్లో చెల్లిస్తామని చెప్పినా వినకుండా కుటుంబసభ్యులు, స్నేహితులకు మార్ఫింగ్ న్యూడ్ వీడియోలను పంపి ఇబ్బంది పెట్టారు. సోషల్ మీడియాలో కూడా షేర్ చేయడంతో.. వాటిని చూసి తీవ్రమనస్తాపానికి గురయ్యాడు శేఖర్.
తన స్నేహితుడితో బాధను పంచుకున్న శేఖర్.. ఏం చేయాలో పాలుపోక సోమవారం ఉదయం తన ఇంట్లోని ఓ గదిలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. శేఖర్ మృతికి లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులే కారణమని అతని కుటుంసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.