అప్పుడే…..విశాఖ రాజధానికి ముహూర్తం…?

ఇప్పటికి ఎన్నో ముహూర్తాలు విశాఖ రాజధానికి పెట్టారు. అవన్నీ కూడా మీడియాలో ప్రచారం జరిగాయి. ఇందులో ఏది నిజమో ఏది కాదో అన్నది ప్రభుత్వ వర్గాలు కూడా [more]

Update: 2021-03-29 11:00 GMT

ఇప్పటికి ఎన్నో ముహూర్తాలు విశాఖ రాజధానికి పెట్టారు. అవన్నీ కూడా మీడియాలో ప్రచారం జరిగాయి. ఇందులో ఏది నిజమో ఏది కాదో అన్నది ప్రభుత్వ వర్గాలు కూడా ఎపుడూ బయటకు చెప్పలేదు. నిజానికి గత ఏడాది మార్చి 25 ఉగాది వేళకు విశాఖకు రాజధాని తరలివస్తుందని అంతా భావించారు. దానికి జగన్ కి అత్యంత సన్నిహితులు అయినా ఒక పీఠాధిపతి ముహూర్తం పెట్టారని కూడా న్యూస్ వైరల్ అయింది. ఈలోగా కరోనా రావడంతో ఆ ముహూర్తం కొట్టుకుపోయింది. ఆ తరువాత గత ఏడాది ఏప్రిల్, మే వంటి ముహూర్తాలు వచ్చారు. చివరికి గత ఏడాది విజయదశమి అని కూడా అన్నారు. ఇపుడు విశాఖ రాజధానికి మరో ముహూర్తంగా చెబుతున్నారు.

ముందే ముఖ్యమంత్రి …..

రాష్ట్రానికి పరిపాలకుడిగా ఉన్న జగన్ తానే తొలిగా విశాఖ వస్తారని అంటున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ ను మే 6వ తేదీన మంచి ముహూర్తాన విశాఖకు తరలిస్తారు అంటున్నారు. విశాఖలో సీఎం మే నెల నుంచి పాలన సాగిస్తారు అని అంటున్నారు. ముందుగా సౌకర్యవంతమైన భవనాన్ని తీసుకుని సీఎం పాలన మొదలుపెడతారని, ఆ తరువాత వీలుని బట్టి సీఎం క్యాంప్ ఆఫీస్ ని విశాఖలో ఆధునిక పద్ధతులలో నిర్మిస్తారని అంటున్నారు. ప్రస్తుతానికి దీనికి సంబంధించి భవనాన్ని ఎంపిక చేసి ఉంచారని కూడా అధికార వర్గాలు చెబుతున్నాయి.

గవర్నర్ కూడా…..

విశాఖకు రాజ్ భవన్ కూడా తరలివస్తోంది అంటున్నారు. విజయవాడలో ఉండే గవర్నర్ బంగళా ఇక మీదట విశాఖ లో కొలువు తీరుతుంది అని చెబుతున్నారు. ఈ విషయంలో కూడా ప్రభుత్వం తగిన ఏర్పాట్లను ముందే చేసి ఉంచింది అంటున్నారు. విశాఖ నగరంలో ఒక అత్యాధిక వసతులు ఉన్న క్లబ్ ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అంటున్నారు. దాన్ని రాజ్ భవన్ గా తీర్చిదిద్దుతారు అని కూడా చెబుతున్నారు. దాంతో విశాఖలోనే గవర్నర్ ఇకపైన పూర్తిగా నివాసం ఉంటారు అన్నది నిజమవుతోంది.

అంతా ఓకే …..

ఇది సరైన సమయం అని వైసీపీ సర్కార్ పెద్దలు భావిస్తున్నారు. మునిసిపల్ ఎన్నికల్లో ఏపీలో అన్ని ప్రాంతాల్లో వైసీపీ గెలిచింది. అంతే కాదు, విశాఖ రాజధానికి ప్రజల ఆమోద ముద్ర ఉందని జీవీఎంసీ ఎన్నికలు రుజువు చేశారు. గుంటూరు, విజయవాడలలో గెలుపు ద్వారా మూడు రాజధానులకు మద్దతు ఉందని కూడా క్లారిటీ వచ్చేసింది. నైతికంగా చంద్రబాబు దెబ్బ తిన్న ఈ సమయంలో ఎటువంటి లేట్ చేయకుండా విశాఖకు షిఫ్ట్ కావాలన్నది వైసీపీ పెద్దల వ్యూహంగా కనిపిస్తోంది. అయితే మూడు రాజధానుల వివాదం కోర్టులో ఉన్నందువల్ల ముందుగా క్యాంప్ ఆఫీస్ ని తరలిస్తారని అంటున్నారు. అది పాలనాపరమైన వ్యవహారం అయినందువల్ల ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు ఉండబోవు అని కూడా అంటున్నారు. చూడాలి మరి ఈ సారి ముహూర్తం ఎంత బలమైనదో, అది ఎంతమేరకు నిజమవుతుందో.

Tags:    

Similar News