అదితి…. కోట(రీ) దాటేనా…?
విజయనగరం టీడీపీ రాజకీయాల్లో అనూహ్యంగా దూసుకువచ్చిన రాజకీయ వారసురాలు.. అదితి గజపతిరాజు. తన తండ్రి అశోక్ గజపతి రాజు వారసత్వాన్ని ముందుకు తీసుకువచ్చిన ఆమె.. టీడీపీ తరఫున [more]
;
విజయనగరం టీడీపీ రాజకీయాల్లో అనూహ్యంగా దూసుకువచ్చిన రాజకీయ వారసురాలు.. అదితి గజపతిరాజు. తన తండ్రి అశోక్ గజపతి రాజు వారసత్వాన్ని ముందుకు తీసుకువచ్చిన ఆమె.. టీడీపీ తరఫున [more]
విజయనగరం టీడీపీ రాజకీయాల్లో అనూహ్యంగా దూసుకువచ్చిన రాజకీయ వారసురాలు.. అదితి గజపతిరాజు. తన తండ్రి అశోక్ గజపతి రాజు వారసత్వాన్ని ముందుకు తీసుకువచ్చిన ఆమె.. టీడీపీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయితే… ఎన్నికల పరంగా ఓడిపోయినా.. రాజకీయంగా అదితి గజపతిరాజు మంచి గుర్తింపు పొందారు. ఇంత వైసీపీ ప్రభంజనంలో కూడా అదితి కేవలం 6 వేల తేడాతో ఓడి గట్టి పోటీ ఇచ్చారు. గెలుపు-ఓటములతో సంబంధం లేకుండా.. ఎన్నికల తర్వాత కూడా నియోజకవర్గంలో తరచూ పర్యటిస్తూ కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు. అన్ని డివిజన్లలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే.. అనూహ్యంగా ఆమె మళ్లీ తెరమరుగయ్యారు. కరోనా సమయంలో అసలు ఆమె నియోజకవర్గంలో పర్యటించింది లేదు.. సాధారణ కార్యకర్తలకు అందుబాటులో ఉన్నదీ లేదు. దీంతో ఆమె రాజకీయ ఉత్సాహం పాలపొంగేనా ? అన్న చర్చలు టీడీపీ వర్గాల్లోనే వస్తున్నాయి.
గత ఎన్నికల సమయంలో….
విషయంలోకి వెళ్తే గత ఎన్నికల్లో తెరమీదికి వచ్చారు అశోక్ కుమార్తె అదితి గజపతిరాజు. వాస్తవానికి రాజుల ఇంటి ఆడపడుచులు బయటకు రారనే పేరుంది. కానీ, దీనికి భిన్నంగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఎన్నికల్లో ఓడినా కొద్ది రోజుల పాటు అదే దూకుడు కొనసాగించారు. అయితే సడెన్‌గా అదితి గజపతిరాజు కోటరీ రాజకీయాల్లో చిక్కుకున్నారనే టాక్ వినిపిస్తోంది. కొన్నాళ్లుగా అదితి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉండరనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఇదే నినాదంతో వైసీపీ నేతలు అదితిపై గతంలో వ్యతిరేక ప్రచారం చేశారు. ఇప్పుడు దానినే ఆమె నిజం చేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
కోటరీలో చిక్కుకుని…..
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యం పెట్టుకున్న అదితి గజపతిరాజు ఆమేరకు దూసుకుపోవడం లేదని అంటున్నారు. కొన్నాళ్ల కిందట టీడీపీకి చెందిన డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి చనిపోతే… ఆయన కుటుంబాన్ని కనీసం పరామర్శించే ప్రయత్నం చేయక పోవడాన్ని నాయకులు తీవ్రంగా తప్పుబట్టారు. ఇప్పుడిప్పుడే రాజకీయాలు నేర్చుకుంటోన్న అదితి కోటరీ వలలో చిక్కుకుని సామాన్య జనాలకు, కేడర్‌కు దూరమవుతున్న పరిస్థితే ఉంది. మరో వైపు వైసీపీ నాయకుడు, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె శ్రావణి నిత్యం దూసుకుపోతోంది.
వాటిని దాటుకుని ముందుకు…..
అంతేకాదు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ కేడర్‌లోనూ ఆమెకు అదితి గజపతిరాజుకి మించిన ఫాలోయింగ్ ఉంది. విజయనగరం వైసీపీలోనూ బలమైన రాజకీయ కోటరీలు, గ్రూపులు వర్గాలు ఉన్నప్పటికీ.. వాటిని దాటుకుని మరీ శ్రావణి ముందుకు పోతున్నారు. దీంతో వైసీపీలో జోష్ కనిపిస్తుండగా.. టీడీపీలో అదితి గజపతిరాజు సైలెంట్ అయిపోవడం.. గడప కూడా దాటక పోవడం.. కేడర్‌ను నిరుత్సాహంలో పడేసింది. మరి ఇప్పటికైనా.. అదితి.. పార్టీ కోటరీలను ఛేదించి.. బయటకు వస్తారా ? పార్టీని , కేడర్‌ను బలోపేతం చేస్తారా ? లేదా ? అన్నది చూడాలి.