నమ్మకమైన నేతకు ఇలా పొగపెడుతున్నారా?

ఆయన తొలి నుంచి జగన్ ను నమ్ముకున్న వ్యక్తి. అలాంటిది ఆయన ఇప్పుడు సొంత నియోజకవర్గంలోనే ఇబ్బందులు పడుతున్నారు. ఆయనే రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్ [more]

;

Update: 2021-05-30 15:30 GMT

ఆయన తొలి నుంచి జగన్ ను నమ్ముకున్న వ్యక్తి. అలాంటిది ఆయన ఇప్పుడు సొంత నియోజకవర్గంలోనే ఇబ్బందులు పడుతున్నారు. ఆయనే రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి. ఆయనకు ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి కి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. దీంతో రాజంపేటలోని వైసీపీలోనే రెండు గ్రూపులు కావడంతో పార్టీ క్యాడర్ అయోమయంలో పడింది. మధ్యలోవచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఫిర్యాదులు అధిష్టానానికి అందాయి.

తొలి నుంచి ఆయనే….

రాజంపేట నియోజకవర్గంలో తొలి నుంచి వైసీపీకి ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి నేతగా ఉన్నారు. రాజంపేట నుంచి రెండుసార్లు ఆయన విజయం సాధించారు. 2009 గెలిచిన ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి ఆ తర్వాత జగన్ వెంట నడిచారు. జగన్ కోసం రాజీనామా చేయడంతో 2012లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి విజయం సాధించారు. అయితే 2014లో ఆయన వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కడప జిల్లాలో అన్ని సీట్లను అప్పట్లో వైసీపీ విజయం సాధించగా ఒక్క రాజంపేటలోనే ఓటమి పాలయింది.

మేడా ఎంట్రీతో….?

2019 ఎన్నికలకు వచ్చేసరికి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీలోకి చేరిపోయారు. 2019 ఎన్నికల్లో టిక్కెట్ హామీ పొంది ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. దీంతో జగన్ ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డికి 2019 ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వలేకపోయారు. మేడా మల్లికార్జున రెడ్డి విజయానికి కృషి చేశారు. అయితే టీడీపీ నుంచి రావడంతో ఆయన తన వెంట వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి అనుచరులకు ఆగ్రహం తెప్పించింది.

ఎలాంటి పదవి ఇవ్వకపోవడంతో….?

పంచాయతీ ఎన్నికల్లో ఇది స్పష్టంగా కనపడింది. వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డికి జగన్ ఎలాంటి పదవి ఇవ్వలేదు. దీంతో ఆయన తన నియోజకవర్గంలో పట్టు కాపాడుకునేందుకు పదవులు, కాంట్రాక్టుల విషయంలో తనకూ భాగం కావాలని పట్టుపడుతున్నారు. దీనికి పార్టీ అధిష్టానం అంగీకరించినా ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి మాత్రం అంగీకరించడం లేదు. దీంతో ఇద్దరూ బద్ధ శత్రువులుగా మారారు. ఇదే కొనసాగితే రాజంపేట నియోజకవర్గం వచ్చే ఎన్నికల్లో వైసీపీ చేజారిపోయే పరిస్థితి అయితే ఉంది.

Tags:    

Similar News