అమ‌ర్‌నాథ్‌రెడ్డి.. పాలిటిక్స్ అంత‌మైన‌ట్టేనా…?

చిత్తూరు జిల్లా ప‌ల‌మ‌నేరు నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌కంటూ ప్రత్యేక‌త‌ను చాటుకున్న నాయ‌కుడు అమ‌ర్‌నాథ్ రెడ్డి. అయితే, ప్రస్తుతం ఈయ‌న ప‌రిస్థితి రాజ‌కీయంగా దారుణంగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్తవానికి [more]

Update: 2019-07-20 05:00 GMT

చిత్తూరు జిల్లా ప‌ల‌మ‌నేరు నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌కంటూ ప్రత్యేక‌త‌ను చాటుకున్న నాయ‌కుడు అమ‌ర్‌నాథ్ రెడ్డి. అయితే, ప్రస్తుతం ఈయ‌న ప‌రిస్థితి రాజ‌కీయంగా దారుణంగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్తవానికి టీడీపీతో ప్రారంభ మైన అమ‌ర్‌నాథ్ రెడ్డి రాజ‌కీయాలు ఉత్సాహంగా సాగాయి. తండ్రి రామ‌కృష్ణారెడ్డి రాజ‌కీయ వార‌స‌త్వాన్ని ఘ‌నంగా అందిపుచ్చుకున్న అమ‌ర్‌నాథ్ రెడ్డి 2004లో ఓడినా 2009లో టీడీపీ త‌ర‌ఫున చిత్తూరు జిల్లా ప‌ల‌మ‌నేరులో పోటీ చేసి.. విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత అనూహ్యంగా వైసీపీ లోకి చేరిన అమ‌ర్‌నాథ్ రెడ్డి 2014లో వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసి మ‌రీ విజ‌యం సాధించారు. అయితే, మంత్రి ప‌ద‌విపై మోజుతో అమ‌ర్‌నాథ్ రెడ్డి చంద్రబాబు ఆక‌ర్ష్ మంత్రానికి ఆక‌ర్షితులై.. పార్టీ నుంచి జంప్ చేశారు.

మంత్రి పదవి కోసం….

ఈ క్రమంలోనే చంద్రబాబు.. కేబినెట్‌లో అమ‌ర్‌నాథ్ రెడ్డికి అవ‌కాశం క‌ల్పించారు. చిత్తూరు జిల్లాలో రెడ్డి సామాజిక‌వ‌ర్గాన్ని ఆక‌ట్టుకునే క్రమంలోనే అమ‌ర్‌నాథ్ రెడ్డిని పార్టీలోకి తీసుకుని మ‌రీ ప్రక్షాళ‌న‌లో మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. ప‌రిశ్రమల శాఖ మంత్రిగా ఆయ‌న నియమితుల‌య్యారు. రెండున్నరేళ్లపాటు అమ‌ర్‌నాథ్ రెడ్డి మంత్రిగా చ‌క్రం తిప్పారు. ఇక‌, ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ త‌ర‌పున ప‌ల‌మ‌నేరు నుంచి పోటీ చేశారు అమ‌ర్‌నాథ్ రెడ్డి. అయితే, వైసీపీ నుంచి అత్యంత సామాన్య కుటుంబం నుంచి ఒక్కొక్కమెట్టు ఎదిగిన వెంక‌ట్‌గౌడ ప్రస్తుతం జ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ద్వారా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. వచ్చీ రావ‌డంతోనే ప‌ల‌మ‌నేరు నుంచి ఆయ‌న పోటీకి దిగారు. ఈ క్రమంలో టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ అభ్యర్థులు అమ‌ర్‌నాథ్ రెడ్డి వ‌ర్సెస్ వెంక‌ట్ గౌడ‌ల‌కు భారీ పోరే సాగింది.

ప్రాధాన్యత తగ్గిందని…

ఎన్నిక‌ల‌కు ముందు అమ‌ర్‌నాథ్ రెడ్డి అయితే వెంక‌ట‌గౌడ అస‌లు త‌న‌కు పోటీయే కాద‌న్నట్టుగా మాట్లాడారు. ఈ పోరులో వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసిన వెంక‌ట గౌడ విజ‌యం సాధించారు. ఎంతో రాజ‌కీయ అనుభ‌వం, వ్యూహ ప్రతివ్యూహాల్లో దిట్టగా పేరు తెచ్చుకున్న అమ‌ర్‌నాథ్‌రెడ్డిని చిత్తుగా ఓడించారు. క‌ట్ చేస్తే.. ఓడిపోయిన అమ‌ర్‌నాథ్‌రెడ్డిని ఇప్పుడు టీడీపీలో ప‌ట్టించుకునే నాధుడే క‌రువ‌య్యారు. ఆయ‌న కూడా పార్టీపై పెద్దగా ఇంట్రస్ట్ చూపించ‌డం లేద‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న సొంత వ్యాపారాలు చేసుకుంటూ.. కాలం వెళ్లదీస్తున్నారు. మ‌రోప‌క్క, వైసీపీ త‌ర‌ఫున విజ‌యం సాధించిన వెంక‌టే గౌడ దూసుకుపోతున్నారు. ప్రజ‌ల స‌మ‌స్య‌ల‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మొత్తానికి టీడీపీలో రెడ్ల రాజ‌కీయాల‌కు కాలం చెల్లింద‌ని కూడా ఆయ‌న త‌న స‌న్నిహితుల వ‌ద్ద వాపోతున్నార‌ట‌. ఇక ఆయ‌న ప్రస్తుతం నియోజ‌క‌వ‌ర్గం కంటే బెంగ‌ళూరులో సొంత వ్యవ‌హారాలు, వ్యాపారాల‌పైనే ఎక్కువుగా కాన్‌సంట్రేష‌న్ చేస్తున్నార‌ట‌.

Tags:    

Similar News