అంబటిపై అసలు రగడ అక్కడి నుంచేనట?

అంబటి రాంబాబు.. వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తాజాగా ఆయనకు సొంత పార్టీలోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో కోడెల శివప్రసాద్ కు ఎలాంటి [more]

Update: 2020-09-19 06:30 GMT

అంబటి రాంబాబు.. వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తాజాగా ఆయనకు సొంత పార్టీలోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో కోడెల శివప్రసాద్ కు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయో.. అవే అంబటికి రిపీట్ అవుతున్నాయంటున్నారు. దీనికి ప్రధాన కారణం అంబటి రాంబాబు స్వయంకృతాపరాధమేనని అంటున్నారు. పార్టీ కోసం కష్టపడిన నేతలను పక్కన పెట్టడంతోనే అంబటి రాంబాబుకు నియోజకవర్గంలోని వైసీపీలో అసంతృప్తి ఏర్పడిందంటున్నారు.

20 కోట్ల పనులకు సంబంధించి…

అంబటి రాంబాబు సత్తెన పల్లి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో కోడెల శివప్రసాద్ పై స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. అయితే నియోజకవర్గంలో అంబటి రాంబాబు సోదరుడు మురళి పెత్తనం చేస్తున్నారు. నియోజకవర్గంలో కాంట్రాక్టులను వైసీపీ నేతలను కాదని ఇతరులకు అప్పగించడంపైనే అసలు రగడ ప్రారంభమయింది. కొద్ది నెలల క్రితం సత్తెనపల్లిలో 20 కోట్లకు సంబంధించి అభివృద్ధి పనులను చిలకలూరిపేటకు చెందిన ఒకరికి అప్పగించారు. స్థానికులకు కాదని బయట వ్యక్తులకు ఎలా అప్పగిస్తారన్న ఆక్రోశం స్థానిక వైసీపీ నేతలది.

సోదరుడు హవాతో….

అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళి సత్తెనపల్లి వైసీపీ నేతలను కాదని టీడీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శలున్నాయి. ప్రతి పనినీ వైసీపీ నేతలకు కాకుండా బయటవారికి అప్పగించడాన్ని వైసీపీలోని ఒక వర్గం జీర్ణించుకోలేక పోయింది. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. అందుకే అంబటి రాంబాబుతో అమితుమీ తేల్చుకునేందుకు ఆ వర్గం సిద్ధపడిందన్నది సత్తెనపల్లిలో టాక్.

ఇదే అనుభవం…..

ఇదే పరిస్థితి సత్తెనపల్లిలో గతంలో కోడెల శివప్రసాద్ కు కూడా ఎదురయింది. అయినా అంబటి రాంబాబు సొంత పార్టీ నేతలను పట్టించుకోకుండా అదే పరిస్థితిని కొని తెచ్చుకుంటున్నారని పార్టీలోనే చర్చ జరుగుతోంది. అందుకే అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారని హైకోర్టులో వైసీపీ నేతలు పిటీషన్ వేశారు. అయితే దీనిని అంబటి రాంబాబు కొట్టి పారేస్తున్నారు. తన మీద కావాలని కొందరు కుట్రపన్నుతున్నారని, న్యాయస్థానంలో కేసు ఉంది కాబట్టి ఇప్పుడే తాను ఏం మాట్లాడలేనని చెబుతున్నారు. మొత్తం మీద సత్తెనపల్లిలో కాంట్రాక్టు పనులే అంబటి రాంబాబుపై అసంతృప్తిికి కారణాలుగా తెలుస్తోంది.

Tags:    

Similar News