వివక్ష…కక్ష.. శిక్ష…?

ఏపీలో తరచూ ఇదే మాట విపక్షాల నుంచి వినీపిస్తోంది. ఏపీలో వైసీపీ సర్కార్ తమ మీద పగ పట్టిందని, కక్ష కట్టిందని తెలుగుదేశం నాయకులు అదే పనిగా [more]

;

Update: 2021-04-26 08:00 GMT

ఏపీలో తరచూ ఇదే మాట విపక్షాల నుంచి వినీపిస్తోంది. ఏపీలో వైసీపీ సర్కార్ తమ మీద పగ పట్టిందని, కక్ష కట్టిందని తెలుగుదేశం నాయకులు అదే పనిగా ఆరోపణలు చేస్తున్నారు. దానికి తోడు జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీ వారినే టార్గెట్ చేశారు అన్నది తటస్థ వర్గాల నుంచి వస్తున్న మాట. మరి నిజంగా జగన్ సర్కార్ టీడీపీ ని వేధించుకుని తింటోందా, శాడిజం చూపిస్తోందా అన్నది కూడా చర్చగా ఉంది. గుంటూరు జిల్లా లో మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్రని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసినా విశాఖలో టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ అక్రమ నిర్మాణం కూల్చేసినా కూడా అదంతా కక్ష సాధింపే అని తమ్ముళ్ళు అంటున్నారు.

ఇపుడే తెలిసిందా …?

ఇదిలా ఉంటే ఏసీబీ, సీఐడి జగన్ జేబు సంస్థలు కావు అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అంటున్నారు. అవి ప్రజల పక్షాన పనిచేయాలని కూడా ఆయన సూచిస్తున్నారు. అయితే ఈ రెండూ కూడా ప్రభుత్వంలో భాగమే. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకోవడం అంతా చూస్తున్నారు. ఇక చంద్రబాబు అయితే అప్పట్లో మాకూ ఒక ఏసీబీ ఉంది అని గట్టిగానే గర్జించారు. మరి దాని మాటేంటి. బాబు ఏసీబీ బూచిని చూపించి నాటి విపక్షం వైసీపీ నేతలను కూడా భయపెట్టారు కదా అన్న మాట కూడా వస్తోంది.

ఇక్కడే దొరికారా…?

ఇక విశాఖలో గత కొంతకాలంగా అక్రమ నిర్మాణాల మీద వైసీపీ సర్కార్ ఉక్కు పాదం మోపుతోంది. అయితే ఆ అక్రమాలు అన్నీ కూడా టీడీపీ నేతలే చేశారని వారి భవనాలే కూల్చుతున్నారు. గీతం విద్యా సంస్థల నుంచి మొదలుపెడితే మాజీ ఎంపీ సబ్బం హరి ఇల్లుతో పాటు తాజాగా పల్లా శ్రీనివాస్ అక్రమ భవనాలు కూల్చివేత దాకా సాగుతున్న తంతు చూసిన వారికి ఇదంతా ఒక పార్టీ మీదనే కక్ష అన్నట్లుగా కనిపిస్తోంది అంటున్నారు. అదే సమయంలో అక్రమ నిర్మాణాలు ఒక్క తెలుగుదేశం నేతలవే లేవు అన్న మాట ఉంది. వైసీపీ నేతలు కూడా అందులో ఉన్నారని చెబుతున్నారు. వారి మీద కూడా ఇలాంటి చర్యలు ఏవీ అని ప్రశ్నిస్తున్న వారికి సమాధానం లేదు అంటున్నారు.

దొందూ దొందే …?

ఇక ఇలాంటి విమర్శలు చేసే అధికారం టీడీపీకి లేదు అంటున్నారు. ఎందుకంటే ఆ పార్టీ అధికారంలో ఉన్నపుడు చేసింది కూడా ఇదేనని చెబుతున్నారు. ఇక మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మరో మాట అంటున్నారు. విశాఖ డైరీ అక్రమాలకు పాల్పడింది వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని. మరి నిన్నటి దాకా వారంతా టీడీపీలోనే ఉన్నారు. అపుడు ఎందుకు చర్యలు తీసుకోలే దని ప్రశ్న కూడా వస్తుంది. అంటే ఇక్కడ ఒక్కటే విషయం ఉంది. ఎవరి అధికారంలో ఉంటే వారే ప్రత్యర్ధుల మీద దాడులు చేస్తారు. దాన్ని కక్ష అనుకున్నా మరేమనుకున్నా తప్పులేదు. కానీ దానికి మించి మరో పదం కూడా ఇక్కడ వాడవచ్చు. అదే రాజకీయం. ఆ సంగతి టీడీపీకి కూడా తెలుసు. తెలిసే ఇలాంటి మాటలతో జనాల సానుభూతి పొందాలని చూస్తున్నారు అనుకోవాలి.

Tags:    

Similar News