ఆంధ్రప్రదేశ్ ఇక బాగుపడదా..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ప్రధాని, హోం మంత్రి అపాయింట్ మెంట్లు దొరకవు. పోలవరం వంటి కీలక జాతీయ ప్రాజెక్టులకు నిధులు విడుదల కావు. అయినా ఏమీ చేయలేని నిస్సహాయత. [more]

Update: 2021-06-08 15:30 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ప్రధాని, హోం మంత్రి అపాయింట్ మెంట్లు దొరకవు. పోలవరం వంటి కీలక జాతీయ ప్రాజెక్టులకు నిధులు విడుదల కావు. అయినా ఏమీ చేయలేని నిస్సహాయత. అగమ్య గోచరంగా కనిపిస్తున్న ఆర్థిక పరిస్థితి. దక్షిణ భారతంలో ప్రగతి శీల ఆలోచనలకు , వ్యాపార దక్షతకు పేరెన్నికగన్న రాష్ట్రంగా ముద్ర పడిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఒక బలహీన రాష్ట్రంగా కనిపిస్తోంది. అధికార, ప్రతిపక్షాల శృతిమించిన రాజకీయాలు కేంద్రం ముందు ఇద్దర్నీ దోషిగా నిలుపుతున్నాయి. ప్రతిపక్షం అవసరం, అధికార పక్షం బలహీనత వెరసి బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నా మాట్టాడలేని స్థితి. పైపెచ్చు రాష్ట్రంలో కనీస బలం లేకుండా రెండు పార్టీలను పరోక్షంగా కేంద్రం నియంత్రిస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి అసహనానికి గురై స్వరం పెంచేందుకు ప్రయత్నించారు. ఫలితంగా కేంద్రంలోని పెద్దలు ఆయనను కలిసేందుకు కూడా ఇష్టపడటం లేదనే వార్తలు వస్తున్నాయి. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలను కూడా నియంత్రించలేక కేంద్రం చేతులెత్తేస్తోంది. ఒత్తిడి చేసి తమకు రావాల్సిన నిధులను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాబట్టుకుంటున్నారు. కానీ ఏపీ విషయంలో ఎటూ పాలుపోని దుస్థితి వెన్నాడుతోంది.

కేంద్రం సయ్యాట…

పోలవరం నిధులు సకాలంలో విడుదల చేయకపోవడం పచ్చి మోసమే. పునరావాసం ప్యాకేజీ పై ఇంతవరకూ స్పష్టత లేదు. ఆ మొత్తం 30 వేల కోట్ల రూపాయల పైచిలుకు. వాటిపై కేంద్రం మాట మారుస్తోంది. ఇప్పుడు కాలవ పనులకూ కొర్రీలు వేస్తోంది. ఇది పోలవరానికి పరోక్షంగా గండి కొట్టడమే. తెలుగుదేశం, వైసీపీ ప్రభుత్వాల వైఫల్యాలే కేంద్రానికి సాకుగా మారుతున్నాయి. కేంద్రం పై ఒత్తిడి పెట్టించి ప్రత్యేక అథారిటీతో రాష్ట ప్రభుత్వం ప్రత్యేక పర్యవేక్షణతో తెలుగుదేశం హయాంలోనే ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఉండాల్సింది. కాంట్రాక్టుల కమీషన్ల యావతో , పోలవరం ప్రాజెక్టు తన ఖాతాలోనే పడాలనే దురుద్దేశంతో చంద్రబాబు నిర్మాణ బాధ్యతలను తలకెత్తుకున్నారు. ప్రాజెక్టుకు తాము డబ్బులిస్తుంటే చంద్రబాబు క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారని అర్థమైన కేంద్రం ప్రాజెక్టును నీరుకార్చడం మొదలు పెట్టింది. నిధుల విడుదలలో జాప్యం చేసింది. అయినప్పటికీ టీడీపీ ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం 2020 డిసెంబర్ నాటికే ప్రాజెక్టు పూర్తయ్యేలా పనులను డిజైన్ చేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరిట మరో కొత్త అంకానికి తెర తీశారు. దీంతో కేంద్రానికి అలుసై పోయింది. ఈ రాజకీయ జంజాటంలో అడిగేవారే లేరని అర్థమైపోయింది. అందుకే కేంద్రం ఆంధ్రప్రదేశ్ తో ఆటలాడుతోంది. ఇదే తంతు కొనసాగితే పోలవరం పూర్తి కావడానికి మరో దశాబ్దం పట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు.

కట్టుతప్పిన కరోనా…

కరోనా తీవ్రత జనసమ్మర్థం ఎక్కువగా ఉండే రాష్ట్రాలు , మహానగరాల్లో ఎక్కువగా ఉంది. ముంబై, ఢిల్లీ, బెంగుళూరులను ఇందుకు ఉదాహరణగా తీసుకోవాలి. కానీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం. మహానగరం ఒక్కటి కూడా లేదు. అయినా కరోనాను కట్టడి చేయడంలో విఫలమైంది. పక్కనున్న తెలంగాణలో హైదరాబాద్ వంటి మహానగరంలోనూ ప్రభుత్వాలు కట్టడి చేయగలిగాయి. ఆంధ్రప్రదేశ్ లో పాజిటివిటీ రేటు జాతీయ స్థాయి కంటే ఎక్కువ ఉంది. నెల రోజులు పైగా కట్టడి చర్యలు తీసుకుంటున్నా రోజువారీ పదివేల కేసుల వద్దనే ఇంకా కుదేలవుతోంది. తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు ఆసుపత్రులను సందర్శిస్తూ , రోగులను పరామర్శిస్తూ నైతిక స్థైర్యం పెంచుతున్నారు. అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యేలా తమ చర్యల ద్వారా సంకేతాలు అందిస్తున్నారు. ఏపీలో ముఖ్యమంత్రి , ప్రతిపక్ష నాయకుడు పరస్పర రాజకీయ యుద్ధాలతోనే కాలక్షేపం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిపక్షాలపై కేసులు పెట్టడంతోనే సమయం సరిపోతోంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు నిరంతరం ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి న్యాయపోరాటాలు చేయడంలోనే ప్రతిపక్షాలకు తీరిక దొరకడం లేదు. ఇతర రాష్ట్రాల ను చూసి ఆంధ్రప్రదేశ్ పాఠాలు నేర్చుకోవడం లేదు.

కొట్లాడుకుందాం…

అన్ని అంశాలను రాజకీయ మయం చేయడంతో ఆంధ్రప్రదేశ్ లో వైద్యరంగమూ బెంబేలెత్తిపోతోంది. ఆనందయ్య తయారు చేసే నాటు ఆయుర్వేద మందునూ తమ రాజకీయాల్లోకి లాగేశారు. ఈ క్రెడిట్ తమ పార్టీల ఖాతాల్లో పడాలనే యావ మొదలైంది. సహజంగానే అధికార పార్టీ ఇందులో పైచేయి సాధించింది. దీనిని అడ్డుకోవడానికి ప్రతిపక్షం పావులు కదుపుతోంది. ఆనందయ్య మందు విషయంలో ప్రభుత్వ జోక్యం ఉంటే సహించమంటూ న్యాయపోరాటం చేస్తామని టీడీపీ ప్రకటించింది. ప్రజలకు ధైర్యం చెప్పే వచనాలు, చర్యలు ముఖ్యమా? రాజకీయాలు ముఖ్యమా? అంటే తమకు పాలిటిక్సే పరమావధి అని చెబుతున్నాయి వైసీపీ, టీడీపీలు. కక్ష పూరిత రాజకీయాలు గతంలోనూ అనేక పార్టీల మధ్య నెలకొని ఉన్న ఘట్టాలున్నాయి. కానీ ఇంతటి ఉపద్రవ సమయంలోనూ ప్రజల ప్రాణాలను బలి పెడుతూ కూడా రాజకీయం చేస్తామనడం ఈ పార్టీలకే చెల్లింది. అధికార ప్రతిపక్షాలు తమ రెండు పార్టీలకు రాష్ట్రంలో ప్రత్యామ్నాయం లేదనుకోవడం అమాయకత్వం. ప్రస్తుతమున్న వ్యవస్థలు విఫలమైనప్పుడు కొత్త పార్టీలకు మార్గం ఏర్పడుతుంది. చారిత్రక సందర్భం వస్తుంది. తమ బాధ్యతలను విస్మరిస్తే ప్రజల్లో నెలకొనే ఆగ్రహావేశాల నుంచే ప్రత్యామ్నాయం పుట్టుకొస్తుంది. ఈ విషయంలో టీడీపీ, వైసీపీలు ఇప్పటికైనా మేలు కోవడం మంచిది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News