విశాఖకు షిఫ్టింగ్ కి ఇదే చివరి ముహూర్తం ?

విశాఖకు రాజధాని తరలింపు అన్నది ఒక తెలుగు టీవీ సీరియల్ జీడిపాకంగా అలా కొన‌సాగుతోంది. 2019 చివరలో ఈ ప్రతిపాదన వచ్చినపుడు ఉన్న ఊపూ హుషార్ ఇపుడు [more]

Update: 2021-01-11 13:30 GMT

విశాఖకు రాజధాని తరలింపు అన్నది ఒక తెలుగు టీవీ సీరియల్ జీడిపాకంగా అలా కొన‌సాగుతోంది. 2019 చివరలో ఈ ప్రతిపాదన వచ్చినపుడు ఉన్న ఊపూ హుషార్ ఇపుడు ఎక్కడా ఎవరికీ లేవు. చెప్పాలంటే విశాఖ జనాలు కూడా రాజధాని ఎప్పటికైనా వస్తుందా అన్న డౌట్లు అయితే బాగానే పెట్టేసుకున్నారు. అయితే అక్కడ ఉన్నది జగన్. ఆయన సంకల్పం గట్టిది. అయ్యేవరకూ అసలు ఊరుకోరు. అదే రాజధాని కోరుకునే వారికి ఒక బలమైన ఆశగా మిగిలి ఉంది. 2020లో రాజధాని విశాఖకు షిఫ్ట్ కావడం ఖాయమని అంతా అనుకున్నారు. చూస్తూండగానే 2021 వచ్చేసింది.

ఉగాది వేళతోనే …

ఉగాదికి విశాఖ రాజధానికి మధ్య అనుబంధం ఉన్నట్లుంది. అందుకే మరో ఉగాది వేళ రాజధాని తరలింపునకు ముడి పెట్టి వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. 2020 మార్చి 25న ఉగాది వేళ విశాఖకు రాజధాని షిఫ్ట్ చేయాలని జగన్ సర్కార్ భావించింది. అయితే అనుకోని ఉపద్రవంగా కరోనా వైరస్ వచ్చిపడింది. ఆ మీదట అసెంబ్లీలో మూడు రాజధానులు తీర్మానం అయి చట్టంగా చేసినా కూడా కోర్టు వివాదాలతో పుణ్యకాలం గడచిపోయింది. దాంతో ఈ ఏడాది ఏప్రిల్ 13వ తేదీన‌ ఉగాది శుభవేళను ఇపుడు సరికొత్త ముహూర్తంగా ముందుకు తెస్తున్నారు.

అప్పటికి తీర్పు…

ఇక రాజధాని విషయంలో కోర్టులో న్యాయపరమైన చిక్కులు ఉన్న సంగతి తెలిసిందే. మూడు రాజధానుల విషయమో హై కోర్టు విచారణ జరుపుతోంది. ఇదిలా ఉంటే హై కోర్టు చీఫ్ జస్టిస్ బదిలీ అయి వెళ్ళడంతో కొత్త సీజే వస్తున్నారు. ఆయన వచ్చిన తరువాత ఈ కేసు విచారణ మళ్లీ జరుగుతుంది అంటున్నారు. ఎలా చూసుకున్నా మరో మూడు నెలల సమయం పడుతుంది అని చెబుతున్నారు. అందుకే ఉగాది టైం ని వైసీపీ సర్కార్ ముహూర్తంగా రెడీ చేసి పెట్టుకుందని అంటున్నారు. అప్పటికి తీర్పు వస్తుందని కూడా అంచనా వేస్తున్నారు.

ఈసారి ఫైనల్ ….

అదిగో ఇదిగో అంటున్న విశాఖ రాజధాని ఈసారి మాత్రం కచ్చితంగా వస్తుంది అని అంటున్నారు. దీని మీద వైసీపీ మంత్రులు బొత్స సత్యనారాయ‌ణ, ధర్మాన కృష్ణ దాస్ అయితే విశాఖకు రాజధాని రావడం ఖాయం. అది కూడా ఉగాది నాటికి అంటూ హింట్ ఇచ్చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ గా పోర్ట్ గెస్ట్ హౌస్ ని రెడీ చేసి ఉంచారని అంటున్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అల్లుడు పైడా క్రిష్ణ ప్రసాద్ కి చెందిన విద్యా సంస్థలను సచివాలయంగా భారీ ఎత్తున మార్పుచేర్పులు చేస్తారని చెబుతున్నారు. ఏప్రిల్ నాటికి రాజధానిని తరలిస్తే కొత్త విద్యా సంవత్సరానికి ఏ విధమైన ‌ఇబ్బందులు ఉండవని కూడా భావిస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే విశాఖకు రాజధాని ఈసారి రావడం కచ్చితమని, ముహూర్తం కూడా తిరుగులేనిదని వైసీపీ నేతలు కాస్తా గట్టిగానే చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News