రాజీ…రాజీ.. అన్నింటా. రాజీ ఫార్ములాయేనా.?

ఆంధ్రులకు పౌరుషం ఎక్కువ అంటారు. తెలివి తేటలు కూడా అధికమని చెబుతారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణా నేతలు అయితే ఏపీ వారు తమ అతి తెలివితో తెలంగాణాను [more]

;

Update: 2020-11-03 09:30 GMT

ఆంధ్రులకు పౌరుషం ఎక్కువ అంటారు. తెలివి తేటలు కూడా అధికమని చెబుతారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణా నేతలు అయితే ఏపీ వారు తమ అతి తెలివితో తెలంగాణాను బాగా మోసం చేస్తున్నారు అని పదే పదే విమర్శలు చేసేవారు. కానీ ఇపుడు ఆరేళ్ళుగా చూసుకుంటే సీన్ రివర్స్ అయింది. ఏపీది అన్నింటా దిగదుడుపే అవుతోంది. ఎటూ రాష్ట్రం విడిపోతుంది కనీసం పోలవరం కట్టుకుంటే బతుకుతామని 2004లో వైఎస్సార్ వేసిన పునాది రాయి సాక్షిగా పోలవరం ఇప్పటికీ అలాగే నత్తనడకగా సాగుతోంది అంటే ఆంధ్రులను తెలివైన వారుగా ఎవరైనా అనుకుంటారా.

లాస్ట్ పంచ్ ఇటేగా…?

ఇక విభజన జరిగి తీరుతుందని తెలిసి కూడా కృత్రిమ ఉద్యమాలు చేస్తూ సమైక్యాంధ్రాగానే ఉంటుందని జనాలను మభ్యపెడుతూ వచ్చిందే ఆంధ్ర నేతలు. లాస్ట్ బాల్ అంటూ లాస్ట్ పంచ్ ఏపీ ప్రజల నెత్తి మీదనే వేసిన మహానుభావులు కూడా ఆంధ్ర నాయకులే కదా. ఇక అక్కడికీ ఏదో బీజేపీ నేతలు తెలివి తెచ్చుకుని ప్రత్యేక హోదా అంటే, పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అంటూ కాంగ్రెస్ ఊరడింపు కార్యక్రమం సాగించింది. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు ఇప్పటికీ నెరవేరలేదు. ప్రత్యేక హోదా హుష్ కాకీ అయిపోతే పోలవరానికి బీటలు వారుతున్నాయి. అయినా ఇదేమని అడిగేందుకు ఈనాటి ఏలికలకు, ఒకనాటి పాలకులకు కూడా తీరిక కోరికా రెండూ లేకుండా పోయాయంటున్నారు.

ఆస్తులన్నీ వదిలేసి ….

ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ మన రాజధాని అని ఆస్తులన్నీ అక్కడే పెట్టారు. చివరికి వట్టి చేతులతో వెనక్కి వచ్చారు. ఆ ఆస్తులకు ఖరీదు కట్టి ఏపీకి రావాల్సి ఆదాయాన్ని లెక్కించి ఇస్తే తన మానాన అది బతుకుతుంది. కానీ ఏపీకి ఆ భాగ్య రేఖ కూడా లేనట్లుగా ఉంది. ఆరేళ్ళు గడచినా లెక్కలు తేలవు ఏపీకి అప్పులు పెరుగుతున్నా కూడా ఎవరూ పట్టించుకోరు. ఈ విషయంలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం తీరు గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిదేమో.

ఆర్టీసీకి భారీ నష్టం….

తాజాగా తెలంగాణాతో ఏపీఎస్ ఆర్టీసీ కుదుర్చుకున్న ఒప్పందం ఆంధ్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు తీవ్ర నష్టం వాటిల్లేలా ఉందని అంటున్నారు. లాక్ డౌన్ కి ముందు రెండు లక్షల 65 వేల కిలోమీటర్లు తెలంగాణా రోడ్లలో నడిపిన ఏపీఎస్ ఆర్టీసీ ఇపుడు కేవలం లక్షా 60 వేల కిలోమీటర్లకే పరిమితం అవుతోంది. ఇంతకంటే దండుగమారి ఒప్పందం మరోటి ఉండదు, ఏపీ నుంచే తెలంగాణాకు జనాలు వస్తారు. కోటి మంది ఉన్న హైదరాబాద్ సిటీలో ఏపీ జనాల సంఖ్య ఎక్కువ. అందువల్ల విజయవాడ హైదరాబాద్ రూట్లకు భారీగా ఆదాయం వస్తుంది. అలాంటి లాభాల‌ రూట్లను కూడా తెలంగాణా ఆర్టీసీ సెట్ చేసిపెడితే ఏపీ ఆర్టీసీ అధికారులు ఒప్పుకున్నారు. అంతే కాదు, ఏపీ రూట్లతో తెలంగాణా బస్సులు ఇకపైన రెట్టింపు తిరుగుతాయట.

అవమానాలే మిగిలాయా…?

ఒక అంచనా ప్రకారం ఏడాదికి దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలు ఏపీఎస్ ఆర్టీసీకి భారీ నష్టం వస్తుందని అంటున్నారు. మరి రెండు నెలల పాటు చర్చలు జరిపి చివరికి ఇలాంటి నష్టదాయకమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం పట్ల ఏపీ ఆర్టీసీలో నిరసన వ్యక్తం అవుతోంది. అదే సమయంలో తెలంగాణా ఆర్టీసీకి ఇంతకు ఇంత ఆదాయం కొత్తగా వస్తుందిట. మొత్తానికి జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలోకి తీసుకుని తెలంగాణాకు షాక్ ఇస్తే దానికి సరైన ట్రీట్మెంట్ ఇపుడు కేసీయార్ ఇచ్చాడని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఏ వైపు నుంచి చూసిన రాజీ పడుతూ నష్టపోతూ ఏపీ పాలకులు రాష్ట్రానికి నష్టం తెస్తున్నారు, అలాగే అయిదు కోట్ల ప్రజలకు అవమానాలు మిగులుస్తున్నార‌న్న ఆవేదన అయితే అందరిలోఒ ఉందిపుడు.

Tags:    

Similar News