అవంతివన్నీ గాండ్రింపులేనా

విశాఖ జిల్లాకు చెందిన వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు మంత్రిగా మూడు నెలల కాలం పూర్తి చేసుకుంటున్నారు. ఆయన ప్రకటనలు ఆర్భాటంగా ఉంటున్నాయి, ఆచరణలో మాత్రం జరిగేది [more]

Update: 2019-08-24 15:30 GMT

విశాఖ జిల్లాకు చెందిన వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు మంత్రిగా మూడు నెలల కాలం పూర్తి చేసుకుంటున్నారు. ఆయన ప్రకటనలు ఆర్భాటంగా ఉంటున్నాయి, ఆచరణలో మాత్రం జరిగేది ఒరిగేది ఏదీ లేదన్న మాట వినిపిస్తోంది. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న మొదట్లోనే ఆయన విశాఖ భూ కుంభకోణంపై సిట్ నివేదికను బయటపెడతామని చెప్పారు. ఆ నివేదికలో పేర్కొన్న వారిని దోషులుగా తేల్చితే ఎంతటి పెద్ద వారైనా వదలకుండా శిక్షిస్తామని కూడా చెప్పారు. ఆ తరువాత ఆయన ఇదే మాటను పదే పదే వినిపిస్తూ వస్తున్నారు. మధ్యలో ఆయన కొత్తగా సిట్ ని వేస్తామని కూడా చెప్పారు. అంటే పాత నివేదిక సంగతి ఎలా ఉన్నా భూ కబ్జాలపై మరో మారు విచారణ జరిపించి అసలైన వారిని జనం ముందుకు తెస్తామని కూడా గట్టిగా చెప్పారు. కానీ భూ కబ్జాల విచారణాపై ఇప్పటికి ఒక అడుగు కూడా ఆ దిశగా పడలేదనే చెప్పాలి.

పీడీ యాక్ట్ అమలు…..

ఇక లేటెస్ట్ గా మంత్రి అవంతి శ్రీనివాసరావు మరో భారీ ప్రకటన చేశారు. విశాఖ జిల్లాలో భూ కభ్జాలకు పాల్పడితే వారి మీద పీడి యాక్ట్ ప్రయోగిస్తామని కూడా ప్రకటించారు. కఠినంగా చర్యలు ఉంటాయని, అందువల్ల భూ కబ్జాదారులకు ఇదే సరైన విధానమని కూడా మంత్రి అన్నారు. కానీ ఓ వైపు పాత భూ కుంభకోణం కధలు అలాగే ఉన్నాయి. బాధితుల వెతలు కూడా తీరలేదు. మరో వైపు తెల్లారిలేస్తే చాలు ఎక్కడో ఒక చోటా కబ్జాలు యధాతధంగా సాగిపోతున్నాయి. మరి మంత్రిఅవంతి శ్రీనివాసరావు ప్రకటనలు ఆచరణలో ఏంతమేరకు అమలు అవుతున్నాయన్న చర్చ అయితే విశాఖ జిల్లాలో సాగుతోంది. ఇక నిన్నటి వరకూ మంత్రి టీడీపీలో ఉంటూ వచ్చారు. ఆయన ఇపుడు వైసీపీ మంత్రి అయ్యారు. మరి పాత దోస్తులతో ఉన్న పరిచయాలు, మొహమాటాలు ఏవైనా మంత్రి అవంతి శ్రీనివాసరావుని ముందుకు సాగకుండా అడ్డుకట్ట వేస్తున్నాయా అన్న సందేహాలు కూడా ఇటు జనంలోనూ, అటు వైసీపీలోనూ కలుగుతున్నాయి.

భీమిలీ నిండా కబ్జాలే….

ఇక్కడో విషయం చెప్పాలి. అవంతి శ్రీనివాసరావు మంత్రిగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న భీమునిపట్నం అసెంబ్లీలోనే పెద్ద ఎత్తున భూ కబ్జాలు సాగాయి. అక్కడ ప్రభుత్వ, ప్రైవేట్ అన్న తేడా లేకుండా దందా చేసి అక్రమార్కులు లాగేసుకున్నారు. ఇక ఇనాం భూములను, అసైండ్ భూములను, దళితులకు ఇచ్చిన వాటిని కూడా చూడకుండా కబ్జా చేసేశారు. మరి ఇవన్నీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకి తెలుసు. ఆయన కొత్తగా రాజకీయాల్లొకి రాలేదు, పైగా ఆయన భీమిలీకి గతంలోనూ ఎమ్మెల్యేగా పనిచేశారు. మరి అన్నీ తెలిసినా మంత్రి ఇంకా మీనమేషాలు లెక్కబెట్టడం వెనక కారణాలు ఏంటన్నది ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న. ఇప్పటికైనా మంత్రి అవంతి శ్రీనివాసరావు చొరవ తీసుకుని విశాఖ భూ కబ్జాలపై గత సర్కార్ వేసిన సిట్ నివేదికను బహిర్గతం చేయాలని వామపక్షాలతో సహా అంతా కోరుతున్నారు. అలాగే విశాఖ భూములకు రక్షణ కల్పించేలా కఠిన చట్టాలను అమలు చేయలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి అవంతి శ్రీనివాసరావు గర్జనలు ఆపి చేతల మనిషిగా నిరూపించుకుంటారా లేదా అన్నది చూడాలి.

Tags:    

Similar News