అయ్యన్న రీబ్యాక్ వ్యూహం ఇదేనా..?
విశాఖ జిల్లా నర్శీపట్నం ఒకనాడు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి అడ్డా. ఆయన పదిసార్లు పోటీ చేస్తే ఏడు సార్లు గెలిచి అనేక తడవలు మంత్రిగా పనిచేశారు. [more]
;
విశాఖ జిల్లా నర్శీపట్నం ఒకనాడు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి అడ్డా. ఆయన పదిసార్లు పోటీ చేస్తే ఏడు సార్లు గెలిచి అనేక తడవలు మంత్రిగా పనిచేశారు. [more]
విశాఖ జిల్లా నర్శీపట్నం ఒకనాడు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి అడ్డా. ఆయన పదిసార్లు పోటీ చేస్తే ఏడు సార్లు గెలిచి అనేక తడవలు మంత్రిగా పనిచేశారు. అయ్యన్న పాత్రుడుకు బాగా పట్టున్న నర్శీపట్నంలో వైసీపీ గత ఎన్నికల్లో గట్టిగా జెండా పాతేసింది. దానికి అయ్యన్న కుటుంబంలోని వివాదాలు కూడా కలసివచ్చాయి. స్వయంగా అయ్యన్న సోదరుడు సన్యాసిపాత్రుడు వైసీపీకి మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ పని సులువు అయింది. ఇపుడు చూస్తే రెండేళ్ళు గడచిపోయాయి. మరి వైసీపీలో అయ్యన్న పాత్రుడు తమ్ముడి పరిస్థితి ఏంటి అన్నదే చర్చ.
అసంతృప్తితోనేనా…?
వైసీపీని నర్శీపట్నంలో గెలిపించడంతో తన వంతుగా కృషి చేసిన సన్యాసిపాత్రుడు చాలా కాలంగా మౌనంగా ఉంటున్నారు. ఆయన వాయిస్ కూడా బయటకు రావడంలేదు. దానికి కారణం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ పట్టించుకోవడంలేదన్న మాట వినిపిస్తోంది. ఉమా శంకర్ తాను ఒక్కడినే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, కీలకమైన నాయకులను పట్టించుకోవడంలేదని అంటున్నారు. ఇక అయ్యన్న పాత్రుడు సోదరుడు ఎమ్మెల్సీ వంటి పెద్ద ఆశతోనే పార్టీలోకి వచ్చారని అంటారు. నర్శీపట్నంలో ఏ పార్టీ గెలవాలన్నా కూడా మునిసిపాలిటీ ఓట్లే కీలకం. మునిసిపాలిటీలో మంచి పట్టున్న సన్యాసిపాత్రుడు రాకతో బలం పెరిగింది అని అంటారు. కానీ వైసీపీ ఊపు, జగన్ క్రేజ్, ఎమ్మెల్యే పెట్ల వ్యక్తిగత బలంతోనే తాము గెలిచామని ఆయన వర్గం అంటోంది.
మళ్లీ వెళ్తారా …?
రాజకీయాల్లో ఏమైనా సాధ్యమే. అది కూడా ఇద్దరూ అన్నదమ్ములు. ఇక చంద్రబాబు కనుక జోక్యం చేసుకుంటే తమ్ముడు అయ్యన్న పాత్రుడు చెంతకు చేరడం ఖాయమని అంటున్నారు. పంచాయతీ ఎన్నికల తరువాత మునిసిపాలిటీ ఎన్నికలు జరుగుతాయి. మరి ఆ సమయానికి సన్యాసిపాత్రుడు వైసీపీలో ఉంటారా అన్న చర్చ అయితే అధికార పార్టీలో వినిపిస్తోంది. అయితే అయ్యన్నపాత్రుడు మాత్రం తన కుమారుడే వారసుడి అని ఇప్పటికే ప్రకటించేశారు. పార్టీ పదవి కూడా ఆయనకే దక్కింది. ఇక వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్ధిగా టీడీపీ తరఫున పోటీ చేసేది విజయ్ పాత్రుడే అంటున్నారు. అందువల్ల అక్కడకు వెళ్ళినా సన్యాసిపాత్రుడికి ఒరిగేది ఏముంటుంది అన్న ప్రశ్న కూడా ఉంది.
చైర్మన్ ఇస్తారా…?
ఇక మునిసిపల్ చైర్మన్ పదవిని సన్యాసిపాత్రుడికి ఇస్తే ఆయన టీడీపీలోకి వెళ్లడానికి రెడీయే అన్న మాట వినిపిస్తోంది. మరి ఆ పదవి వైసీపీలో కూడా ఇవ్వవచ్చు. కానీ ఎమ్మెల్యే దృష్టిలో వెరే వారు ఉన్నారని అంటున్నారు. పైగా అయ్యన్న పాత్రుడు కుటుంబాన్ని నమ్మితే ఎప్పటికైనా ముప్పే అన్న ముందస్తు ఆలోచనతోనే సన్యాసిపాత్రుడి విషయంలో ఎమ్మెల్యే ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారు అంటున్నారు. అంటే పొమ్మనక పొగ పెడితే మాతం తమ్ముడికి అన్నయ్య సన్నిధే అసలైన పెన్నిధి అవుతుంది అంటున్నారు. ఏది ఏమైనా నర్శీపట్నంలో పట్టుని పెంచుకోవడానికి టీడీపీ వేసే ఎత్తులలో సన్యాసిపాత్రుడు రీబ్యాక్ వ్యూహం కూడా ఉందని అంటున్నారు.